విజయనగరం కలెక్టరేట్: రాబోయే ఎండా కాలంలో ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సూచించారు. ప్రజలు పలుచటి కాటన్ దుస్తులు ధరించడం, తలపై టోపీ లేదా రుమాలు ధరించడం, తరచుగా మంచినీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో ఎక్కువసేపు పని చేయకూడదని తెలిపారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడ ఉన్న చల్లటి ప్రదేశానికి తరలించి తడి గుడ్డతో శరీరాన్ని చల్లబరచాలని, అవసరమైతే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతున్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు.


