లోక్‌ అదాలత్‌లతో వేగవంతమైన పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌లతో వేగవంతమైన పరిష్కారం

Mar 15 2026 1:27 AM | Updated on Mar 15 2026 1:27 AM

పార్వతీపురం: లోక్‌ అదాలత్‌లతో సమస్యలు పరిష్కారం వేగవంతంగా జరుగుతుందని పార్వతీపురం రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్‌.దామోదరరావు అన్నారు. శనివారం కోర్టు ఆవరణలో నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో రాజీ పడదగ్గ సివిల్‌, క్రిమినల్‌, చెక్‌బౌన్స్‌ తదితర కేసులను రాజీ చేశారు. ఇందులో మోటార్‌ ఏక్సిడెంట్‌ కేసులు 8, సివిల్‌ దావాలు 29, క్రిమినల్‌ కేసులు 855 ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లతో విలువైన సమయం, వ్యయం ఆదా అవుతుందన్నారు. లోక్‌ అదాలత్‌లో పరిష్కారం అయిన కేసులకు సంబంధించి కక్షిదారులు గతంలో చెల్లించిన కోర్టు ఫీజును తిరిగి పొందవచ్చునని న్యాయ సేవాధికార సంస్థ పేర్కొందన్నారు. సదస్సులో అడిషనల్‌ జుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ జె.సౌమ్య జోస్పిన్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు ఎన్‌.శ్రీనివాసరావు, వెంకటరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

108లో ప్రసవం

సీతంపేట: మండలంలోని వెదుల్లవలస గ్రామానికి చెందిన గర్భిణి శనివారం 108లో ప్రసవమైంది. సవర సుమిత్ర అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. వెంటనే ఈఎంటీ రవిబాబు, పైలేట్‌ రమణ గ్రామానికి చేరుకొని గర్భిణీని తీసుకువస్తుండగా దిబ్బగూడ గ్రామం వద్దకు వచ్చేసరికి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనాన్ని పక్కకు ఆపి సిబ్బంది సుమిత్రకు ప్రసవం చేయించారు. సుమిత్ర మూడో కాన్పులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను స్థానిక ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. వీరు చేసిన సేవలకు గ్రామస్తులు కుటుంబ సభ్యులు అభినందించారు.

కాట్రగడ వైపు ఏనుగుల పయనం

భామిని: మండలంలోని కాట్రగడ వైపు ఏనుగులు శనివారం పయనమయ్యాయి. గ్రామ సమీపంలోని మొక్కజొన్న పంటలను ఆహారంగా తీసుకుంటుండడంతో పంట మొత్తం నాశనం అవుతున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి నేరడి బ్యారేజి వద్ద వరద కాలువలో దిగి ఆవలకు దాటినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం నేరడి, కాట్రగడ, బొమ్మిక ప్రాంత పంట పొలాలను తీవ్ర నష్టం కలిగిస్తున్నట్టు రైతులు వాపోతున్నారు.

ముగిసిన ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు

పార్వతీపురం రూరల్‌: జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా సాగిన ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు శనివారం ముగిశాయి. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నేత్ర వైద్య అధికారి జీరు నగేష్‌రెడ్డి పర్యవేక్షణలో ఆఫ్తాల్మిక్‌ అధికారులు, నేత్ర వైద్య సహాయకులు కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు, స్క్రీనింగ్‌ పరీక్షలు, ర్యాలీలు చేపట్టి నీటి కాసుల వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కంటి చూపు సంరక్షణపై సూచనలు చేశారు.

ముందస్తు గుర్తింపుతోనే నివారణ

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కంటి వైద్య నిపుణులు డాక్టర్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో రోగులకు నేత్ర పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అంధత్వ నివారణ సంస్థ మేనేజర్‌ డాక్టర్‌ సూరయ కౌశిక్‌ మాట్లాడుతూ గ్లకోమా బాధితులను గుర్తించి ప్రాధమిక దశలో ఉన్న వారికి చికిత్స అందించి మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిని మెరుగైన చికిత్స, శస్త్రచికిత్సల కోసం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆఫ్తాల్మిక్‌ ఆఫీసర్‌ కృష్ణారావు, ఆప్టో మెట్రిస్ట్‌ స్వాతి, శిక్షణ పొందుతున్న నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement