ప్రాణం తీసిన అజాగ్రత్త.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అజాగ్రత్త..

Mar 15 2026 1:32 AM | Updated on Mar 15 2026 1:32 AM

ప్రాణం తీసిన అజాగ్రత్త..

లారీ టైర్‌ కింద పడి డ్రైవర్‌ మృతి

కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద ఒక డ్రైవర్‌ అజాగ్రత్త వల్ల మరో డ్రైవర్‌ ప్రాణం పోయింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మొయ్యి శ్రీను (53) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామానికి చెందిన మొయ్యి శ్రీను లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామ సమీపంలో గల రైల్వేస్టేషన్‌ బొగ్గు యార్డు నుంచి లారీలో బొగ్గు లోడ్‌ చేసుకుని సమీపంలోని రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద ఆపాడు. లారీ నుంచి బొగ్గు ధూళి పైకి ఎగరకుండా ఉండేందుకు టార్పాలిన్‌ కప్పుతున్నాడు. ఈ క్రమంలో లారీ కింద పడుకుని తాడు కడుతుండగా.. అదే సమయంలో అక్కడే ఉన్న మరో లారీ రివర్స్‌గా వస్తూ శ్రీను తలపైనుంచి వెళ్లిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. లారీని రివర్స్‌ చేస్తున్న డ్రైవర్‌ అజాగ్రత్త వల్ల మరో లారీ డ్రైవర్‌ మృతి చెందడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

నేడు ఉల్లాస్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ పరీక్ష

విజయనగరం అర్బన్‌: వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఉల్లాస్‌ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఉల్లాస్‌ ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ పరీక్ష ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు వయోజన విద్య నోడల్‌ అధికారి ఎ.వేణుగోపాలకృష్ణ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని 27 మండలాలు, 4 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,11,369 మంది అభ్యాసకులు పరీక్షకు హాజరుకానుండగా ఇందుకు 1,356 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఎస్‌జీటీలు, అంగన్‌వాడీ ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించినట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం వయోజన విద్యా విభాగానికి చెందిన ప్రదీప్‌ బి.హెదాపూను జిల్లా పరిశీలకుడిగా నియమించిందని తెలిపారు. అదేవిధంగా జిల్లా సమన్వయ కమిటీతో పాటు మండల స్థాయిలో ఎంపీడీఓలు, ఏపీఎంలు సీడీపీఓలు, మున్సిపల్‌ స్థాయిలో సీఎంఎంలు, వయోజన విద్యాశాఖ పర్యవేక్షకులు పరీక్షల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నారన్నారు.

మృతిపై అనుమానాల్లేవు..

విజయనగరం క్రైమ్‌: విజయనగరం వన్‌టౌన్‌ పీఎస్‌ పరిధిలోని తోటపాలెం రామ మందిరం సమీపంలో నివసిస్తున్న మోహన్‌ అనే వ్యక్తి శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈయన రక్తపు మడుగులో పడి ఉండడంపై మొదట్లో అనుమానాలు వ్యక్తం చేసినా ప్రస్తుతం ఎటువంటి అనుమానాలు లేవని సీఐ చౌదరి తెలిపారు. ఈ మేరకు మృతుని భార్య పద్మావతి కుమార్తెతో కలిసి శనివారం స్టేషన్‌కు వచ్చి తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాల్లేవని చెప్పిందన్నారు. మద్యం మత్తులో మంచంపై పడిపోవడం వల్ల తలకు గాయమై రక్తం కారినట్లు క్లూస్‌ టీమ్‌ సభ్యులు కూడా తేల్చారన్నారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

విజయనగరం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో శనివారం నిర్వహించిన బాలల నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. బొబ్బిలి గ్రామానికి చెందిన పవిత్ర నృత్యాలయం బృందంచే ప్రదర్శించిన వివిధ నృత్య రూపకాలు అలరించాయి. అనంతరం బాలలకు ఆలయ మేనేజర్‌ ఏవీ రమణ ప్రశంసాపత్రాలు అందించారు.

ఉచిత నేత్ర వైద్యశిబిరానికి స్పందన

విజయనగరం టౌన్‌: నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో స్వామి కంటి ఆస్పత్రి సౌజన్యంతో శనివారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దోసూరి దాలినాయుడు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, రిటైర్డ్‌ ఉద్యోగస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మురళీధర్‌, శ్రీధర్‌, అశోక్‌, సాయి ప్రసాద్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఆలుగు వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement