● యూటీఎఫ్ మహిళా సదస్సులో సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణి
విజయనగరం అర్బన్: మహిళలపై జరుగుతున్న అణచివేత, లింగవివక్ష, భౌతిక దాడులలను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులు సమాజంలో చైతన్యం తీసుకురావాలని సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు పి.మణి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా పరిషత్ మినిస్ట్రీరియల్ హాల్‌లో ‘సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర’ అనే అంశంపై జరిగిన సదస్సుకు ఆమె ముఖ్యవక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల మూసివేత కారణంగా బాలికలు విద్యకు దూరమవుతున్నారని, ఇది సమాజాభివృద్ధికి ప్రతికూలమన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు మాట్లాడుతూ.. మహిళా ఉపాధ్యాయుల కోసం పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకు యూటీఎఫ్ పోరాటం చేస్తోందన్నారు. మహిళా కమిటీ కన్వీనర్ జి.సుశీల, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె.కస్తూరి, రాష్ట్ర కౌన్సిలర్ బీబీఎల్ మాధవీలత, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ భాస్కరరావు, కోశాధికారి సీహెచ్ తిరుపతినాయుడు, జిల్లా కార్యదర్శులు కె.ప్రసాద్, ఎ.శంకరరావు, జి.రాజారావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు జేఆర్‌సీ పట్నాయక్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ డైరెక్టర్ జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, సీనియర్ నాయకుడు డి.రాము, తదితరులు పాల్గొన్నారు.


