వైఎస్సార్ సీపీ బలపరిచిన వార్డు అభ్యర్థులకు బెదిరింపులు 8, 11, 12 వార్డు సభ్యులను నామినేషన్ కోసం సత్తెనపల్లి తరలించిన పోలీసులు అప్పటికే సమయం మించిపోయిందంటూ వెనక్కి పంపిన వైనం
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
సాక్షి టాస్క్ ఫోర్స్: వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా పోలీసులు అడ్డుకున్న ఘటన పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ బలపరిచన వార్డు అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. గ్రామంలోని 8వ వార్డుకు షేక్ రెడా హుస్సేన్, 11వ వార్డుకు పాపాబత్తుని దాసు, 12వ వార్డుకు బిళ్ళా మరియమ్మ నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. టీడీపీకి చెందిన కనుమూరి బాజీ చౌదరి ఉద్దేశపూర్వకంగా పోలీసుల సహాయంతో నామినేషన్ వేయించుకుండా కాలయాపన చేయించాడు. ఉదయం 11 గంటల నుంచి పలుమార్లు తిప్పి నాలుగు గంటల వరకు నామినేషన్ వేయకుండా నామినేషన్ కేంద్రం వద్ద పడి కాపులు కాసేలా చేశారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోలీసులు జీపులోనే ముగ్గురు అభ్యర్థులను సత్తెనపల్లిలోని ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేయిస్తామని వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. సత్తెనపల్లి వెళ్లేసరికి సమయం మించిపోయిందని పోలీస్ అధికారులు వెనక్కి పంపారు. అన్యాయం జరిగిందని నామినేషన్ వేయించాలని నామినేషన్ కేంద్రం వద్ద అధికారులను అభ్యర్థించిన ససేమీరా అంటూ తిప్పి పంపడమే కాక పోలీసులు లాఠీలతో భయభ్రాంతులకు గురిచేసి పరుగులు తీయించారు.
ఉద్దేశపూర్వకంగానే అన్యాయం చేశారు
ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటలకు వరకు నామినేషన్ కేంద్రం వద్ద నిలబెట్టారు. సాయంత్రం ఇక్కడ కుదరదు అంటూ సత్తెనపల్లిలో నామినేషన్ వేయిస్తామని చెప్పి సమయం అయిపోయే వరకు తిప్పి చివరకు నామినేషన్ వేయకుండా చేశారని బాధితులు వాపోయారు. తమకు నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు.
మా గ్రామంలో టీడీపీ నాయకుడు బాజీ చౌదరి, ఎస్‌ఐ కె.సతీష్ కుమ్మకై ్క వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్ వేయకుండా ఉదేశపూర్వకంగా అడ్డుకున్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే లాఠీచార్జి చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి, పల్నాడు జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం.
–వనిపెంట వీరారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి


