కూటమిలో కుర్చీ కుంపట్లు | - | Sakshi
Sakshi News home page

కూటమిలో కుర్చీ కుంపట్లు

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

కూటమిలో కుర్చీ కుంపట్లు నరసరావుపేట టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి ఎంపికలో ఆధిపత్య పోరు తొలి రోజే వైఎస్సార్‌ సీపీ దూకుడు

నామినేషన్లు మొదలైనా ఖరారుకాని చైర్మన్‌ అభ్యర్థి జనసేనకు సీట్ల పంపకాలే అసలు సమస్య! ఏ వార్డు ఎవరికో తేలక అభ్యర్థుల్లో అయోమయం తొలిరోజే భారీగా నామినేషన్లు వేసిన వైఎస్సార్‌ సీపీ

నరసరావుపేట టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల వేళ కూటమిలో కుంపటి రాజుకుంది. అధికారం చేతిలో ఉన్నా.. అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. చైర్మన్‌ కుర్చీ కోసం టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు ఒకవైపు.. కౌన్సిలర్‌ సీట్ల కేటాయింపులో జనసేన పట్టుదల మరోవైపు.. వెరసి కూటమి నేతలకు ఎన్నికల ముందే అసలు పరీక్ష ఎదురైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా చైర్మన్‌ అభ్యర్థి ఎవరో తేలని పరిస్థితి నెలకొంది. ఏ వార్డు నుంచి ఎవరు పోటీ చేయాలో కూడా స్పష్టత లేకపోవడంతో ఆశావహులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మరోవైపు వైఎస్సార్‌ సీపీ మాత్రం తొలిరోజే పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసి ఎన్నికల బరిలో తన సన్నద్ధతను చాటింది.

చైర్మన్‌ కుర్చీ.. కత్తి మీద సామే!

నరసరావుపేట మున్సిపల్‌ చైర్మన్‌ పదవి టీడీపీలో చిచ్చు పెడుతోంది. ఆ పార్టీకి చెందిన కపలవాయి విజయకుమార్‌, నాగసరపు సుబ్బరాయ గుప్తా మధ్య పోటీ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఎవరికి వారు తమకే చైర్మన్‌ పదవి దక్కుతుందనే ధీమాతో ముఖ్య నాయకులు, కౌన్సిలర్‌ అభ్యర్థులను కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అండదండలు తమకే ఉన్నాయంటూ ఇరువురూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య పరోక్ష ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరపైకి వచ్చాయి. అవినీతి, అక్రమాల ఆరోపణలతో మొదలైన ఈ వ్యవహారం వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. చైర్మన్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో ఇద్దరినీ సమన్వయం చేయడం ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. చివరకు పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించి ఎమ్మెల్యే ఈ వ్యవహారం నుంచి పక్కకు తప్పుకొన్నట్లు తెలుస్తోంది. అయితే నామినేషన్ల ప్రక్రియ రెండు రోజుల్లో ముగియనుండగా ఇప్పటికీ అభ్యర్థి పేరు ప్రకటించకపోవడం టీడీపీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది.

జనసేనతో సీట్ల పంచాయితీ

టీడీపీలో చైర్మన్‌ అభ్యర్థి పంచాయితీ ఒక కొలిక్కి రాకముందే జనసేనతో సీట్ల సర్దుబాటు వ్యవహారం మరో తలనొప్పిగా మారింది. మున్సిపల్‌ ఎన్నికల్లో తమకు 15 కౌన్సిలర్‌ స్థానాలు కేటాయించాలని, లేదంటే అన్ని వార్డుల్లోనూ పోటీ చేస్తామని జనసేన నియోజకవర్గ ఇనన్‌చార్జి సయ్యద్‌ జిలానీ స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఇరు పార్టీల ముఖ్య నాయకులు రంగంలోకి దిగి చర్చలు జరిపారు. చివరకు 11 స్థానాలు కేటాయించేందుకు ప్రాథమికంగా అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఆ 11 స్థానాలు ఏవన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. ఇక కూటమిలో మరో భాగస్వామి అయిన బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నది కూడా స్పష్టం కాలేదు.

ఊరేగింపుగా వెళ్లి.. ఉసూరుమన్న అభ్యర్థి!

సీట్ల సర్దుబాటులో నెలకొన్న గందరగోళానికి బరంపేటకు చెందిన ఓ టీడీపీ నాయకుడి వ్యవహారమే ఉదాహరణగా నిలుస్తోంది. నామినేషన్‌ వేసేందుకు ఊరేగింపుతో టీడీపీ కార్యాలయానికి వెళ్లిన సదరు నాయకుడుకి ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబును షాకిచ్చాడు. తాను పోటీ చేయాలనుకున్న వార్డు జనసేనకు కేటాయించినట్లు ఎమ్మెల్యే చెప్పడంతో ఒక్కసారిగా నిరాశకు గురయ్యాడు. అప్పటికే ఊరేగింపుతో వచ్చి పరువు పోయే పరిస్థితి ఎదురవడంతో నామినేషనన్‌ వేసిన అనంతరం ఉపసంహరించుకుంటానని ప్రాధేయపడినట్లు తెలిసింది. చివరకు నామినేషన్‌ దాఖలు చేసి బిక్కమోహంతో వెనుతిరిగాడు. ఇదే పరిస్థితి పలు వార్డులో అధికార పార్టీలో కనిపిస్తుంది.

కూటమి పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక, సీట్ల పంపకాలపై గందరగోళం కొనసాగుతుండగా వైఎస్సార్‌ సీపీ మాత్రం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజే దూకుడు ప్రదర్శించింది. చైర్మన్‌న్‌ అభ్యర్థిగా షేక్‌ ఖాజావలి నామినేషన్‌ దాఖలు చేయగా, మొత్తం 48 వార్డులకు గాను 34 వార్డుల్లో కౌన్సిలర్‌ అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. మొదటిరోజే చైర్మన్‌తో పాటు పెద్ద సంఖ్యలో కౌన్సిలర్‌ అభ్యర్థులు నామినేషన్లు వేయడం ఆ పార్టీ ఎన్నికల సన్నద్ధతను చాటుతోంది. మరోవైపు టీడీపీ తరఫున తొలిరోజు కేవలం 10 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. అధికార కూటమిలోనే అభ్యర్థుల ఖరారు, సీట్ల పంపకాలపై స్పష్టత లేకపోవడం దీనికి ఒక కారణంగా కనిపిస్తోంది. మున్సిపల్‌ ఎన్నికలు వైఎస్సార్‌ సీపీతో పోరుకంటే ముందుగా కూటమిలోని అంతర్గత విభేదాలనే పరీక్షిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement