నామినేషన్లకు వేళాయె..! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లకు వేళాయె..!

Nov 15 2026 8:29 PM | Updated on Nov 15 2026 8:29 PM

నేటి నుంచి పంచాయతీ నామినేషన్లు

మూడు విడతల్లో 512 పంచాయతీలు, 5,286 వార్డులకు ఎన్నికలు మొదటి విడతలో 173 పంచాయతీలు, 1,712 వార్డులు క్లస్టర్ల వారీగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు ఏర్పాట్లు తొలివిడతకు 58 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ

సత్తెనపల్లి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు మొదలైంది. మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 512 గ్రామ పంచాయతీలకు, 5,286 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకుగాను 5,340 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 12,36,776 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో భాగంగా ఈనెల 26న మొదటి విడత, 29న రెండో విడత, డిసెంబర్‌ 2న మూడో విడత ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నేడు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కాగానే మొదట విడత జరిగే గ్రామ పంచాయతీల్లో నామినేషన్లను ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు స్వీకరిస్తారు.ఇందుకు గాను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు డాక్టర్‌ కృతికా శుక్లా మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయితీల్లో నామినేషన్లు స్వీకరించేందుకు తగిన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేశారు. జిల్లాలో మొత్తం 512 గ్రామ పంచాయతీలో 5,340 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో 1,698 సాధారణ కేటగిరి,1,612 సెన్సిటివ్‌ కేటగిరి,2030 హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు.

మొదటి విడత..

మొదటి విడతలో ఎన్నికలు జరిగే 173 పంచాయతీలు, 1,712వార్డుల్లో ఎన్నికల నిమిత్తం 1,712 పోలింగ్‌ కేంద్రాలను, 35 పోలింగ్‌ లొకేషన్స్‌ను ఏర్పాటు చేశారు. 3,44,373 మంది ఓటర్లకు గాను పురుషులు 1,70,678 మంది, మహిళలు 1,73,670 మంది, ఇతరులు 25 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొదటి విడత నామినేషన్లు నేటి (ఆదివారం) నుంచి ఈనెల 17వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఈనెల 18న పరిశీలన, 19న అప్పీల్‌, 20న అప్పీళ్లపై పరిష్కారం, 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగానే పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఈ నెల 26న పోలింగ్‌ మధ్యాహ్నం నుంచి కౌంటింగ్‌ నిర్వహించి విజేతలను ప్రకటి స్తారు.ప్రతి ఒక్క మండలానికి ఫ్‌లైయింగ్‌స్క్వాడ్‌ బృందం, ఒక సహాయ వ్యయ వివ రాల అధికారి, జిల్లాలో ఒక సర్వేలెన్స్‌ బృందం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షిస్తారు.

58 కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ..

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా తొలివిడత నామినేషన్ల స్వీకరణ కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్లస్టర్‌ గ్రామంగా గుర్తించి నాలుగు నుంచి ఐదు గ్రామాలకు సంబంధించిన సర్పంచ్‌, వార్డు స్థానాల అభ్యర్థుల నామినేషన్లు అక్కడే స్వీకరించనున్నారు. రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు పోలింగ్‌ సామగ్రితో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. నామినేషన్లు స్వీకరణ నుంచి కౌంటింగ్‌ పూర్తయ్యే వరకు రిటర్నింగ్‌ అధికారులు పర్యవేక్షిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement