చెన్నాయపాలెంలో మాజీ సర్పంచ్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు స్టేషన్ వద్దకు చేరుకున్న గ్రామానికి చెందిన మద్దతుదారులు నరసింహారావుకు అండగా నిలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిర్వహించనున్న గ్రామ సర్పంచ్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా అధికార టీడీపీ శ్రేణుల మధ్య ఆధిపత్య పోరు బలంగా నెలకొంది. స్థానిక సంస్థల మండల పరిషత్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో సర్పంచ్ పదవులు పొందేందుకు టీడీపీలో ఆశావహుల సంఖ్య పెరిగింది. స్థానిక ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తనకు అనుకూలమైన వర్గ నాయకులకు పదవులు కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తుండటంతో టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. ప్రజాబలం ఉన్న నాయకులకు కాకుండా, ప్రజాభిప్రాయాలను పక్కనపెట్టి ఇష్టానుసారంగా ఎంపికలు చేయడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
రచ్చకెక్కిన విభేదాలు
మాచవరం మండలంలోని చెన్నాయపాలెం గ్రామంలో టీడీపీలో వర్గ విభేదాలు తలెత్తాయి. గ్రామానికి చెందిన ఇద్దరు మాజీ సర్పంచులు మరోసారి సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేస్తున్న నాదెండ్ల బ్రహ్మం ఇదే గ్రామానికి చెందినవారు. ఆయన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహితుడు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నాదెండ్ల బ్రహ్మం గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన టీడీపీ నేతలతో పాటు మండలంలోని పలువురు టీడీపీ నాయకులు బ్రహ్మంకు మద్దతుగా నిలిచారు. కూటమి అధికారం చేపట్టిన తర్వాత బ్రహ్మంకు మద్దతుగా నిలిచిన నాయకులపై వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టీడీపీలో చురుగ్గా పనిచేసిన సీనియర్ నాయకులను పక్కనపెట్టి, ఎమ్మెల్యే అనుచర వర్గ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడంపై టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో మండలంలోని చెన్నాయపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బండ్ల నరసింహారావు అలియాస్ రాయుడు, మరో మాజీ సర్పంచ్ అంజయ్య మరోసారి సర్పంచ్ పదవిని ఆశిస్తూ గ్రామంలోని ఆయా వర్గాల వారిని కలుస్తున్నారు. దీంతో గ్రామంలోని టీడీపీలో విభేదాలు తలెత్తాయి.
పోలీసులతో కుట్రలు
బండ్ల నరసింహారావు టీడీపీ రెబల్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటూ ప్రచారం చేసి పోలీసులకు సమాచారం అందించారు. టీడీపీ నియోజకవర్గ అధిష్ఠానం ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు నరసింహారావును అర్ధరాత్రి సమయంలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామానికి చెందిన మద్దతుదారులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. నరసింహారావును ఎందుకు అరెస్టు చేశారో కారణాలను తెలియజేయాలంటూ పోలీసులను నిలదీశారు. దీంతో పోలీసులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితిని గమనించిన పోలీసులు గ్రామస్తులను బయటకు పంపించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన శౌరీలు అనే మహిళ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని గ్రామస్తులు ఆరోపించారు. నరసింహారావుకు మద్దతుగా వచ్చిన మరో పది మంది యువకులను పోలీసులు ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించడంతో గ్రామంలో ఒక్కసారిగా ఆగ్రహావేశాలు నెలకొన్నాయి. పోలీసుల తీరును, అధిష్ఠానం నిర్ణయాన్ని గ్రామస్తులు తప్పుబట్టారు. ఏదైనా సమస్య తలెత్తితే ఇరు వర్గాల మధ్య చర్చలు జరిపి సయోధ్య కుదర్చాలి కానీ, అక్రమంగా అరెస్టు చేయించి నిర్బంధానికి గురిచేయడం సరికాదంటూ టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. విషయం తెలుసుకున్న పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, దాచేపల్లి సీఐ ఖాజావలి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. స్థానిక ఎస్‌ఐ పవన్ కుమార్ నుంచి వివరాలు సేకరించి, నరసింహారావుతో పాటు ఆయన మద్దతుదారులను ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ముందస్తు బైండోవర్లు నమోదు
ఈ ఘటనపై స్థానిక ఎస్‌ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గతంలో కేసులు ఉన్నవారిపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే చెన్నాయపాలెం గ్రామానికి చెందిన బండ్ల నరసింహారావుపై పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉండటంతో తీసుకువచ్చామని చెప్పారు. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు నరసింహారావు మద్దతుదారులు స్టేషన్ వద్దకు వచ్చారని, వారికి విషయం వివరించి పంపించామని తెలిపారు.


