చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: మురసు తుఫాన్‌న్‌కారణంగా నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించింది. హోంశాఖ సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్ దాస్, వ్యవసాయ సంక్షేమశాఖ ఏడీసీ ప్రశాంత్ ఆర్మోరికర్, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వ్యవసాయ విభాగం ఏడీ హిమాలయగార్గ్, విద్యుత్ ప్రాధికారసంస్థ డీడీ ప్రయణ్‌గార్గ్‌లతో కూడిన బృందంతో జిల్లా కలెక్టర్ కృతికాశుక్లా, నోడల్ అధికారి జగ్గారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. తొలుత చిలకలూరి పేట మండలం బొప్పూడి గ్రామ పరిధిలో కేంద్ర బృందం పర్యటించింది. వరద ముంపు తాలూకు ప్రాంతాన్ని, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలను పరిశీలించింది. గ్రామంలోని ముస్లిం, ఎస్సీ కాలనీల్లో తుఫాన్‌కు దెబ్బతిన్న ఇళ్లను సందర్శించి బాధితులతో మాట్లాడింది. దెబ్బతిన్న ఇళ్ల పునర్నిర్మాణానికి కేంద్ర బృందం ఆమోదం తెలిపింది. అదేవిధంగా కొత్త హైవే బైపాస్ సమీపంలోని నష్టపోయిన మిర్చి పంటలను పరిశీలించింది. బాధిత రైతులతో మాట్లాడి, వారి గోడు ఆలకించారు. ఇదే ప్రాంతంలో బాతుల పెంపకందారులు సైతం కేంద్ర బృందాన్ని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అక్కడే ఉన్న రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు తుఫాన్ సమయంలో తిమ్మాపురం అండర్ పాస్‌వద్ద నీటిలో చిక్కుకున్న ముగ్గురు మహిళల్ని కాపాడిన విషయాన్ని కేంద్రబృందానికి తెలపగా అవార్డుకు సీఐ పేరును పంపించాలని కలెక్టర్‌కు బృంద సభ్యులు సూచించారు.
నష్ట నివారణకు తగు చర్యలు...
చిలకలూరిపేట: తుఫాన్ ప్రభావంతో సంభవించిన నష్టాన్ని నివారించేందుకు తగు చర్యలు తీసు కుంటానని అంతర్ మంత్రిత్వశాఖల కేంద్ర బృందానికి నాయకత్వం వహించిన కేంద్ర సంయుక్త కార్యదర్శి చిత్తరంజన్‌దాస్ చెప్పారు. మురసు తుఫాన్ ప్రభావంతో జిల్లాలో సంభవించిన నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందం శనివారం చిలకలూరిపేటను సందర్శించింది. తొలుత మున్సిపల్ కౌన్సిల్‌హాలులో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్, ఆర్‌అండ్‌బీ, వ్యవసాయం, ఇరిగేషన్, పంచాయతీరాజ్ తదితర శాఖల ఉన్నతాధికారుల నుంచి జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలలో వాటిల్లిన నష్టం అంచనాలను ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వివరించారు. కేంద్ర బృందం సభ్యులు వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ అదనపు అభివృద్ధి కమిషనర్ ప్రశాంత్ ఆర్మోరికర్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హిమాలయ గార్గ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ ఎండీ ప్రఖర్‌జైన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు/నాదెండ్ల: తూబాడులో ఎద్దువాగు, 38.50 ఎకరాల ఇరిగేషన్ చెరువులో ఆర్‌డబ్ల్యూఎస్ జేజేఎం నిధులతో చేపట్టిన గండ్లను, స్థానికంగా నష్టపోయిన పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించారు. వాగు వెడల్పు లేని కారణంగా తరచు పొంగి పొలాలపై వరదనీరు పడి నష్టపోతున్నట్లు రైతులు బృందానికి చెప్పారు. అక్కడ నుంచి యడ్లపాడు మండలంలోని నాదెండ్ల–లింగారావుపాలెం బీటీ రోడ్డు ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించారు. మైదవోలు మార్గంలోని పొలాలు, జాలాది, గణేశునివారిపాలెం, వేలూరు పరిధిలోని దెబ్బతిన్న పత్తి, మిర్చి, జ్యూట్, కంది పొలాలు పరిశీలించారు. జాలాది నక్కవాగు వద్ద పడ్డ గండ్లు, ధ్వంసమైన కోతకు గురైన, కొట్టుకుపోయిన బీటీరోడ్డును బృందం పరిశీలించింది.
మురసు తుఫాన్ నష్టాలపై క్షేత్రస్థాయిలో పర్యటన


