పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
మాచర్ల: ఎన్ని ఆటంకాలు వచ్చినా తప్పనిసరిగా ప్రజలంతా పురపాలక సంఘ ఎన్నికలలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుని వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు. మాచర్లలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మున్సిపల్ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ చైర్మన్, కౌన్సిలర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించి, అక్రమాలకు, అన్యాయాలకు, ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఏ విధమైన అంతరాయాలు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి చెప్పారు. నగరంలోని ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.


