మాజీ మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ ఎన్నికల్లో యథేచ్ఛగా అరాచకాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి విడదల రజిని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న 44 వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్నాక ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి నాయకులు, పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు ఒక మాఫియాలా తయారయ్యారని, వారికి పోలీస్ యంత్రాంగం పూర్తిగా వత్తాసు పలుకుతోందని విమర్శించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు బెదిరింపులకు దిగి బలవంతంగా 16 నామినేషన్లను ఉపసంహరింపజేశారని మండిపడ్డారు. ఊళ్లో ఉండనివ్వం, ఆస్తులను ధ్వంసం చేస్తాం, వ్యాపారాలు చేసుకోలేరు.. అంటూ కౌన్సిలర్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని వివరించారు. తమ పార్టీకి చెందిన చైర్‌పర్సన్ అభ్యర్థిని బెదిరించి, భయానక వాతావరణం సృష్టించి అర్ధరాత్రి పార్టీ మారేలా ఒత్తిడి చేశారని విమర్శించారు. వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను, చురుగ్గా పనిచేస్తున్న కార్యకర్తలను, బూత్ ఏజెంట్లను రాత్రికి రాత్రే పోలీసులు అక్రమంగా స్టేషన్లకు తరలించారని ఆమె విమర్శించారు. నేరుగా పోలీసులే బెదిరింపులకు దిగడంతోపాటు, స్థానిక కూటమి నాయకులు, ఎమ్మెల్యే ఫోన్లు చేసి బెదిరించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటన్నింటినీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని స్పష్టం చేశారు. ఏకగ్రీవాలు పోనూ ఎన్నికలు జరుగుతున్న 32వార్డులో 16 వార్డుల్లో బూత్‌లను ఆక్రమించి, అభ్యర్థులను కిడ్నాప్ చేశారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రౌడీలు, గూండాలను రప్పించి పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకుంటున్నారని విమర్శించారు. వైఎస్సార్ ఈసపీ బూత్ ఏజెంట్లను బయటకు ఈడ్చివేసి, కొట్టి తరమడమే కాకుండా భారీగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారని తెలిపారు. ప్రజలకు చేసిన మేలును చెప్పుకొని ఓట్లు అడిగే ధైర్యం లేకనే ఇలాంటి దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు, రిగ్గింగ్‌లకు తెగబడుతున్నారని రజిని విమర్శించారు. అధికారాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకొని సాధించే ఫలితాలు నిజమైన గెలుపు అనిపించుకోదని, ఇది ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేయడమేనని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఎస్‌ఈసీకి ఫిర్యాదు
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చిలకలూరిపేటలో జరిగిన రిగ్గింగ్, బూత్‌ల ఆక్రమణ, ఓటర్ల బెదిరింపులు, దాడులు, ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించిన ఘటనలపై మాజీ మంత్రి విడదల రజిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆదివారం పలువురు వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు ఆమెను కలిసి పోలింగ్ సమయంలో చోటుచేసుకున్న ఘటనలను వివరించారు. ఈ అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు. చిలకలూరిపేట మున్సిపాలిటీలోని మొత్తం 48 వార్డులకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలు, బూత్‌ల సీసీటీవీ ఫుటేజీని పోలింగ్ ప్రారంభానికి ముందు ఉదయం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసి బ్యాలెట్ బాక్సులకు సీల్ వేసే వరకు భద్రపరచాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు సంబంధించిన వీడియోలు, డిజిటల్ ఆధారాలను తొలగించకుండా, మార్చకుండా భద్రపరిచేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. పోలింగ్ సందర్భంగా జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్న బూత్ ఆక్రమణలు, భౌతిక దాడులు, బెదిరింపులు, ఇతర ఎన్నికల అక్రమాలపై స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గాయపడిన అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లు, బూత్ ఏజెంట్లు, బాధిత ఓటర్ల వాంగ్మూలాలను నమోదు చేసి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయి, పోలింగ్ విశ్వసనీయత దెబ్బతిన్నట్లు తేలిన కేంద్రాల్లో పోలింగ్‌ను రద్దు చేసి, తగిన భద్రతతో రీపోలింగ్ నిర్వహించాలని మాజీ మంత్రి విడదల రజిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా వినియోగించుకునేలా చూడటం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొంటూ, ఈ ఫిర్యాదును అత్యవసరంగా పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.


