సత్తెనపల్లి: జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి అన్నారు.పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మున్సిపల్ ఎన్ని కల పోలింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు ఆదివారం పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లు, పోలీసుల విధులు, ఎన్నికల నిర్వ హణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ 30, 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు.ఎన్నికల సమయంలో ఎవరైనా అనవసరంగా గొడవలకు అల్లర్లకు పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారంతో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేసేందుకు పోలీస్ శాఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.


