మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ: సింహాన్ని బోనులో బంధించి ఆటలాడుకుంటున్నారని, దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు సవాల్ విసిరారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి అనంతరం స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం పోలూరు అర్చనమూర్తి, చైర్మన్ అభ్యర్థి పీఎస్ ఖాన్, ఇతర వార్డు కౌన్సిలర్ అభ్యర్థులతో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సమావేశమయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దౌర్జన్యం చేసి రిగ్గింగులకు పాల్పడి దాడులు చేసి అక్రమ మార్గాల్లో గెలుపొందటం దాన్ని విజయం అనరని అన్నారు. రానున్న రోజుల్లో ఎక్కడ అవమానం జరిగితే అక్కడే కార్యకర్తలకు న్యాయం చేస్తామని, అక్రమాలు జరిగిన వార్డుల్లో తమ అభ్యర్థులే కౌన్సిలర్లుగా ఉంటారని చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, పోలీసులు ఎవరు కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరని, స్థానిక సీఐ ప్రభాకర్‌రావు పచ్చ చొక్కా ధరించిన ఏజెంట్‌లాగా పోలింగ్ స్టేషన్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను బెదిరించి టీడీపీ గూండాలను బూతుల్లోకి పంపి టీడీపీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేశాడని విమర్శించారు. రిగ్గింగ్ జరిగిన 8, 5, 12, 19, 32 వార్డుల్లో రీపోలింగ్ జరిపించాలని ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కెన ఇద్దరూ ఉన్న వార్డులోనే మహిళపై ఇంత దారుణంగా దాడి జరిగితే పట్టించుకునే వారు లేరని, ఇక ఆడవాళ్లకి రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. అక్రమాలు పాల్పడి మీరు గెలిచినప్పటికీ అది తాత్కాలికేమని నైతిక విజయం తమదేనని ప్రజలు ఈ పరిణామాలు అందరూ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ఓటుతో బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


