మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక బెదిరింపులు అమలుకు నోచుకోని ‘సూపర్ సిక్స్’ పథకాలు హామీలు ఇచ్చి దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులతో గెలవడానికి యత్నాలు జిల్లాలో 18 జెడ్పీటీసీలు, 378 ఎంపీటీసీ స్థానాలు కూటమికి ఏకగ్రీవం
సత్తెనపల్లి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీలో ఉండకుండా చేసేందుకు కూటమి నేతలు పోలీసుల సహకారంతో ఎక్కడికక్కడ కుట్రలకు పాల్పడ్డారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి ఉపసంహరణ వరకు ప్రలోభాలు, బెదిరింపులు, ప్రత్యక్ష దాడులకు పాల్పడుతూ బేరసారాలకు తెరలేపారు. ప్రలోభాలకు లొంగని నేతల ఇళ్లకు వెళ్లి, పోలీసులు అభ్యర్థులను పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యేందుకు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని, ఇలా ఎన్నో రకాలుగా బెదిరింపులకు గురిచేశారు. అన్ని స్థానాలనూ ఏకగ్రీవం చేయాలని ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇవ్వడంతో, ఏకగ్రీవం చేసేందుకు ఎమ్మెల్యేలంతా పడరాని పాట్లు పడ్డారు.
అంతా అడ్డగోలుగానే...
జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలు ఉండగా, గురజాల నియోజకవర్గంలోని ఒక మున్సిపాలిటీ, రెండు నగర పంచాయతీలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనివ్వకుండా ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకున్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో కోర్టు కేసుల కారణంగా రెండో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, మాచర్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, చిలకలూరిపేటలో 16 వార్డులను, సత్తెనపల్లిలో ఒక వార్డును దొడ్డిదారిన కూటమి నేతలు ఏకగ్రీవం చేసుకున్నారు. అంతేకాకుండా, చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజనీని హౌస్ అరెస్ట్ చేసి, వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని బెదిరింపులకు గురిచేసి టీడీపీలో చేర్చుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఆమెకు పచ్చ కండువా కప్పారు. మాచర్లలో మూడు కౌన్సిలర్ స్థానాలకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు బీ–ఫారాలు ఇచ్చి, మిగిలిన 33 వార్డు కౌన్సిలర్ స్థానాలకు, మున్సిపల్ చైర్మన్ స్థానానికి బీ–ఫారాలు ఇవ్వకుండా ఎమ్మెల్యే బ్రహ్మరెడ్డి నేతృత్వంలో అడ్డుకున్నారు. దీంతో వారంతా స్వతంత్రులుగా బరిలో దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో 28 జెడ్పీటీసీ స్థానాలకు గాను 18 స్థానాలను కూటమి నేతలు ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకున్నారు. కేవలం 10 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 419 ఎంపీటీసీ స్థానాలకు గాను టీడీపీ 347 స్థానాలను, జనసేన 31 స్థానాలను ఏకపక్షంగా ఏకగ్రీవం చేసుకున్నాయి. మూడు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. కేవలం 38 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరగనున్నాయి.
చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకత..
చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు పేదల జీవనాన్ని మరింత దుర్భరంగా మార్చేశాయి. రెండున్నరేళ్ల పాలనలో ఎక్కడా పేదలకు సెంటు స్థలం ఇవ్వలేదు. కొత్త పింఛన్ ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. ఆడబిడ్డ నిధిగా మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు నెలకు రూ.3,000 ఇస్తానన్న హామీల ఊసే లేదు. ఎక్కడికక్కడ ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకతతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తే ఓటమి తప్పదన్న భావనలో కూటమి పక్షాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీలో ఉండకుండా చేసేందుకు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్నికలు వస్తున్నాయంటే ప్రజలపై ప్రేమ...
ఎన్నికలు వస్తే చంద్రబాబుకు ప్రజలపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తుంది. అభివృద్ధి, సంక్షేమం పేరుతో అబద్ధాల పుట్ట బయటకు వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలిసినా, చంద్రబాబు ఓవైపు పక్కా గృహ నిర్మాణాలకు నిధులు విడుదల చేస్తామని, మరోవైపు పెన్షన్లు మంజూరు చేస్తామని, ఇంకోవైపు ఇళ్ల స్థలాలు ఇస్తామని సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తూ ప్రచారాలు గుప్పించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇళ్ల మంజూరు, పెన్షన్లు, తదితర సంక్షేమ పథకాలు మంజూరు కావని అర్థం చేసుకున్న ప్రజలు కూటమి ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి నాంది పలకనున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో, వక్రమార్గంలో ఏకగ్రీవాలకు శ్రీకారం చుట్టారనే విమర్శలు ఉన్నాయి.


