ఎమ్మెల్సీ, మాజీ డీఐజీ చంద్రగిరి యేసురత్నం ఎన్నికల్లో నిబంధనల మేరకు నడుచుకోవాలి ఒత్తిళ్లకు తలొగ్గితే భవిష్యత్తు నాశనమే
గుంటూరు ఎడ్యుకేషన్: పోలీసులు రాజకీయనేతలకు సలామ్ కొడుతూ... ఎన్నికల్లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ, మాజీ డీఐజీ చంద్రగిరి యేసురత్నం అన్నారు. నవంబర్ ఒకటో తేదీన గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఓప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న రాజకీయ ప్రత్యర్థులపై జరుగుతున్న దాడులు, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, పోలీసు శాఖలో దాదాపు 30 ఏళ్ల సర్వీసు శాశ్వతమని అన్నారు. తాను 30 ఏళ్ల పాటు పోలీసు శాఖలో పనిచేసిన అనుభవంతో చెబుతున్నానని, పోలీసులు రాజకీయ నాయకులను, అధికారులను సంతృప్తిపరిచేందుకు చట్టానికి విరుద్ధంగా వ్యవహరించవద్దని సూచించారు. పోలీసులు ఎప్పుడూ చట్ట ప్రకారమే విధులు నిర్వహించాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి తప్పులు చేయవద్దని అన్నారు. తప్పులు చేయిస్తున్న అధికారులు, భవిష్యత్తులో పోలీసులు ఇబ్బందుల్లో పడినప్పుడు అండగా నిలవరని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చే జీతం ప్రజలకు సేవ చేయడానికేనని గుర్తుంచుకోవాలన్నారు. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులపై పోలీసుల ఎదుటే దాడులకు దిగుతున్నా స్పందించడం లేదని విమర్శించారు. ఇలాంటి ఘటనలకు భవిష్యత్తులో పోలీసులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోరాదని, చట్టాన్ని అతిక్రమించిన వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. పోలీసులు తమ విధుల నిర్వహణలో రాజ్యాంగం మేరకు నడుచుకోవాలని, ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి ఘటన నమోదవుతోందని స్పష్టం చేశారు. న్యాయ స్థానాలు సైతం సుమోటాగా కేసులు నమోదు చేయడంతో పాటు దశాబ్దాల కిందట జరిగిన నేరాల్లో సైతం పోలీసుల పాత్రపై విచారణ జరిపిస్తున్నాయని అన్నారు.


