ప్రజాసేవే పరమావధిగా...
వైఎస్సార్ సీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పీఎస్ ఖాన్
వినుకొండ: పట్టణాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపించి, సుందరంగా తీర్చిదిద్దడమే తన ఏకై క లక్ష్యమని వైఎస్సార్ సీపీ వినుకొండ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పఠాన్ సాలేహా ఖాన్ (పీఎస్ ఖాన్) తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు అనుగుణంగా, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నాయకత్వంలో పట్టణ సమగ్ర ప్రగతికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
ప్రాధాన్యతలు ఇవే...
ఆయన మాట్లాడుతూ... ‘‘గతంలో నిలిచిపోయిన మున్సిపల్ కాంప్లెక్స్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి, వినియోగంలోకి తీసుకొస్తా. యువత, మైనార్టీల సంక్షేమానికి కృషి. మైనార్టీ కళాశాల, ముస్లిం షాదీఖానా ఏర్పాటు చేస్తా. క్రీడాకారులకు నిలయంగా ఉండేలా మున్సిపల్ స్టేడియం నిర్మాణ పనులను పూర్తి చేయిస్తాను. ప్రజా రవాణా వ్యవస్థ, పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపడతాం. పట్టణంలో నిత్యం వేధిస్తున్న ట్రాఫిక్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతాం. శివారు కాలనీల్లో డ్రైనేజీ, పారిశుధ్యం, సురక్షిత తాగునీటి సరఫరా సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తా. పెండింగ్‌లో ఉన్న హిందూ శ్మశానవాటికను స్వర్గధామంగా నిర్మించడానికి చర్యలు తీసుకుంటా. ఆర్యవైశ్యుల వ్యాపార అభివృద్ధికి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తాను. అన్ని వార్డుల సమగ్ర ప్రగతికి కృషి చేస్తా. పట్టణంలోని ప్రతి వార్డులో అంతర్గత రహదారులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తాను. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వినుకొండ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తా. ఈ అభివృద్ధి యజ్ఞంలో పట్టణ ప్రజలందరూ ఆశీర్వదించి, మద్దతుగా నిలవాలని’’ అని పేర్కొన్నారు.
పార్టీ ఆవిర్భావ సమయం నుంచి నిరంతరం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నానని పీఎస్ ఖాన్ తెలిపారు. ప్రజారోగ్యం, సామాజిక సేవ పట్ల ఉన్న అంకితభావంతోనే తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకుని పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, బొల్లా బ్రహ్మనాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


