ఓటమి భయంతోనే కూటమి అరాచకాలు | - | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే కూటమి అరాచకాలు

Oct 31 2026 6:02 AM | Updated on Oct 31 2026 6:02 AM

మరోమారు చైర్‌పర్సన్‌ పదవి మైనార్టీలకు దక్కరాదనే కుట్ర మాజీ మంత్రి విడదల రజిని

చిలకలూరిపేట: చెప్పుకోవడానికి చేసిన మంచి అంటూ ఏమీ లేకపోవడంతో స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న ఆమె నివాసంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నర ఏళ్లలో చేసింది ఏమీ లేక, గూండాయిజం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గత మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా అన్‌రిజర్వుడ్‌ స్థానంలో ఒక ముస్లిం మైనార్టీని చైర్మన్‌ చేసిందన్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ షేక్‌ కరిమున్‌ అనే ముస్లిం మహిళకు చైర్‌పర్సన్‌గా పోటీ చేసే అవకాశం కల్పించామన్నారు. అది ఇష్టం లేక, మరోమారు ఇక్కడ మైనార్టీ వర్గానికి చెందిన వారు ఆ పదవిలో ఉండకుండా ఆమెను భయపెట్టి, బెదిరించి టీడీపీలో చేర్చుకొని ఊళ్లో లేకుండా పంపించి వేశారని ఆరోపించారు.

పోలీసులు తీరు మార్చుకోవాలి

బూత్‌ ఏజెంట్లను పోలీసులే బెదిరిస్తున్నారని, బైండోవర్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కూడా పోలీస్‌స్టేషన్‌కు లాక్కెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని, అలాంటి అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ధైర్యంగా ఎన్నికల్లో నిలబడుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలకు ఆమె అభినందనలు తెలిపారు. ఓడిపోతామన్న భయం లేకపోతే వైఎస్సార్‌ సీపీలా ఽధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడగాలని కూటమికి సవాలు విసిరారు. ఇంతలా దౌర్జన్యానికి పాల్పడేకన్నా అసెంబ్లీలో ఒక చట్టం చేసుకొని నామినేటెడ్‌గా పదవులు నియామకం చేసుకోవచ్చుగదా అని పేర్కొన్నారు. కూటమి అరాచకాలకు చరమగీతం పాడేలా ప్రజలు ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ పరిశీలకుడు చిట్టా విజయభాస్కరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement