చంద్రబాబు సర్కార్ నిర్వాకంతో రైతులు విలవిల ఆయకట్టుకు సాగునీరు అందక తీవ్ర నష్టాలు మరమ్మతులకు కూడా నిధులు విదల్చని ప్రభుత్వం
చేతులెత్తేసిన టీడీపీ సర్కారు
అమరావతి: బంజరు భూములను బంగరు భూములుగా మార్చి మండలంలో వేలాది ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఏడు ఎత్తిపోతల పథకాలకు నీరందకపోవటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల జీవన విధానాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లిన ఎత్తిపోతల పథకాలకు నేడు కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి నీరు రాకపోవడంతో సాగునీరు అందని దుస్థితి దాపురించింది. ఎగువన పులిచింతల నుంచి నీరు వదలకపోవటంతో నదిలో నీరు లేదు.
వేలాది ఎకరాల ఆయకట్టు
మండలంలో రూ.కోట్లాది వ్యయంతో వేలాది ఎకరాలకు సాగునీరందించేందుకు ధరణికోట, బలుసుపాడు, 75 త్యాళ్లూరు, అత్తలూరు, మునుగోడు, దిడుగు, పొందుగల ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. నేడు సాగునీరు అందని పరిస్థితి ఉంది.
● మండలంలో ఉన్న బలుసుపాడు ఎత్తిపోతల పథకం ద్వారా మల్లాది, కాశిపాడు, బలుసుపాడు గ్రామాల్లోని 3,091 ఎకరాల ఆయకట్టుకు నీరు గతంలో అందేది.
● ధరణికోట ఎత్తిపోతల పథకం ద్వారా ధరణికోట, లింగాపురం గ్రామాలకు చెందిన 2,413 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేవారు.
● 75 త్యాళ్లూరు ఎత్తిపోతల పథకం ద్వారా 75 త్యాళ్లూరు, కాశిపాడు, బలుసుపాడు, జలాలపురం, రామాపురం, పెదకూరపాడు, అత్తలూరు గ్రామాల్లో 4,469 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేది.
● అత్తలూరు ఎత్తిపోతల పథకం ద్వారా 1,330 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇచ్చేవారు.
● దిడుగు ఎత్తిపోతల పథకం ద్వారా దిడుగు, లింగాపురం, కాశిపాడు, ముత్తాయపాలెం గ్రామాలలోని 2,650 ఎకరాల ఆయకట్టుకు నీరు విడుదల అయ్యేది.
● పొందుగల ఎత్తిపోతల పథకం ద్వారా పొందుగల గ్రామానికి చెందిన 500 ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేవారు.
● మునగోడు ఎత్తిపోతల పథకం ద్వారా మునగోడు, జూపూడి, బయ్యవరం గ్రామాల్లో 1,937 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇచ్చేవారు.
నీరు లేక వెలవెల
ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు, టీడీపీ ప్రభుత్వం ముందుచూపు లేకపోవటంతో గత నెల రోజుల నుంచి కృష్ణానది నీటిమట్టం పూర్తిగా తగ్గిపోవటంతో ఎత్తిపోతల పథకాల సంపుల్లోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. నదిలో ఎక్కడో కిలోమీటరు దూరంలో ఉన్న నీటిపాయ నుంచి ప్రొక్లెయినర్ల ద్వారా కాలువలు తీసి నీటిని సంపులోకి నడిపినప్పటికీ, రోజురోజుకూ నీరు లోపలికి పోతుండటం స్కీం నిర్వాహకులను కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. అలాగే నదిలోని ఇసుకను ఇష్టారాజ్యంగా తీయటం వల్ల నది గమనం మారిపోయి, భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో ప్రస్తుత దుస్థితి తలెత్తిందనే విమర్శలు ఉన్నాయి. నదిలో నీటి లోతు తక్కువగా ఉండటంతో ఎత్తిపోతల పథకాల మోటార్లలోకి నీటితోపాటు రాళ్లు, ఇసుక వస్తున్నాయి. తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో రూ.లక్షలు వృథాగా ఖర్చు అవుతున్నాయి.
మిర్చికి సాగునీరు అందేనా?
ఒక్కొక్క స్కీం కింద 500 నుంచి వెయ్యి ఎకరాల వరకు మిరప పంటకు సాగునీరు అందుతుందో లేదో అయోమయ స్థితిలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం నారు నాటే సమయంలో పెద్దగా నీటి అవసరం లేకపోయినా, ముందుముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో చివరికి పంట చేతికొచ్చే సమయంలో సాగునీరు అందకపోతే, అదనపు ఖర్చు చేసి డీజిల్ ఇంజిన్లతో తడులు ఇవ్వాల్సి వస్తే అప్పులే మిగులుతాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పరిశ్రమలకు విద్యుత్ కోతలు విధించిన ప్రభుత్వం, స్కీంలు పనిచేసే సమయాల్లో విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తే ఎలా అని కంగారు పడుతున్నారు. సుమారు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న కాలువల చివరి పొలాలకు నీరు అందుతుందో లేదో భయపడుతున్నారు.
గతంలో నదిలో నీరు ఎత్తిపోతల పథకాలకు అందకపోతే సంపుల వరకు కాలువలు తవ్వి నీటిని తీసుకురావటానికి, అలాగే ఏడాదికొకసారి ఎత్తిపోతల పథకాల నిర్వాహకుల నుంచి అంచనాలు స్వీకరించి ప్రభుత్వం నిధులు కేటాయించేది. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గత రెండేళ్లుగా మరమ్మతులకు ఎటువంటి నిధులు కేటాయించడం లేదు. దీంతో కనీసం మరమ్మతులకు నోచుకోవటం లేదు.


