నరసరావుపేట: రైతుల నుంచి ఈ పంట ద్వారా వంద శాతం పంట నమోదు చేయించి వంద శాతం ఈకేవైసీ చేయించి రైతులను భాగస్వా మ్యం చేయాలని జేసీ సంజనా శ్రీహర్ష పేర్కొన్నారు. కార్యాలయంలో మంగళవారం త్వరలో ప్రారంభం కానున్న ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు, అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారుల తో సమీక్ష చేశారు. జిల్లాలో ఉన్న 311 మాయిశ్చరైజర్ మీటర్లు సకాలంలో క్యాలిబ్రేషన్ చేయించాలని, రైస్ మిల్లులు తనిఖీ చేసి మిల్లు సామర్ధ్యం అంచనా వేయాలని సూచించారు. రైతులకు కావాల్సిన గోనెసంచులు ముందుగానే అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యం రవాణా వాహనాలకు జీపీఎస్ ట్యాగింగ్ ఉండాలని, అవి అమర్చిన వాహనాలనే సిద్ధం చేయాలన్నారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్, జిల్లా పౌరసరఫరాల అధికారి, మార్కెటింగ్, తూనికలు, జీడీసీఎంఎంసీ, పీఏసీఎస్, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
సత్తెనపల్లి: సత్తెనపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక (ఆర్‌ఎస్) పాఠశా ల ఉపాధ్యాయురాలు శివలక్ష్మికి అక్షర కిరీటి బిరుదును ప్రదానం చేశారు. శ్రీశ్రీ కళావేదిక భద్రాద్రి కవితా పండుగ జాతీయ ద్విశతాధిక కవి సమ్మేళనం ఈ నెల 20న భద్రాచలంలోని డాక్టర్ పాల్‌రాజ్ ఇంజినీరింగ్ కళాశాల్లో జరిగింది. ఈ సమ్మేళనంలో ఉపాధ్యాయురాలు శివలక్ష్మి కవిత బోయీ భీమన్న సాహిత్యం టాప్–20 విజేతగా నిలిచింది. తన స్వీయ రచనలతో బాలల గేయా లు రాగయుక్తంగా విద్యార్థులకు నేర్పించడంతో పాటు తెలుగు పట్ల ఆసక్తితో అనేక రచనలు రచించారు. ఈ సందర్భంగా ఆమెకు అక్షర కిరీటి బిరుదును ఐటీడీఏ పీవో బి రాహుల్, శ్రీశ్రీ కళావేదిక జాతీయ బాధ్యులు తాళ్లూరి పంచాక్షరయ్య, ఈశ్వరరీభూషణ్, పార్థసారధి, వరలక్ష్మీ, శ్రీనివాసాచార్యులు నుంచి ఆమె అందుకున్నారు. మంగళవారం పట్టణంలోని పలువురు ఉపాధ్యాయు లు, సాహితీవేత్తలు ఆమెను అభినందించారు.
పెదకూరపాడు: భౌతిక, రసాయన శాస్త్రవేత్త మైకేల్ ఫారడే జయంతి వేడుకలను స్థానిక జెడ్పీ హైస్కూల్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఫారడే చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హైస్కూల్ హెచ్‌ఎం కేవీ రమణ మాట్లాడుతూ మైకేల్ ఫారడేను ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిజంగా పేర్కొంటారని తెలిపారు. నిత్యజీవితంలో మనం ఉపయోగించే డైనమో, ఎలక్ట్రిక్ మోటార్, ట్రాన్స్‌ఫార్మర్ వంటి విద్యుత్ సాంకేతికతల అభివృద్ధికి ఫారడే పరిశోధనలు పునాదిగా నిలిచాయన్నారు. బెంజీన్ కూడా ఫారడే కనుగొన్నారని తెలిపారు. బుక్‌బైండింగ్ షాపులో పనిచేస్తూ స్వయంకృషితో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన ఫారడే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన పరిశోధనలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక రంగాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు.
పిడుగురాళ్ల రూరల్: మాలలపై దాడి చేసిన అగ్రవర్ణాలపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ పల్నాడు జిల్లా ఇన్‌చార్జి రామకృష్ణ అన్నారు. పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో అగ్రవర్ణాల దాడిలో గాయపడిన కోడి రెక్క శ్రీనివాసరావు, హేమంత్‌లను మంగళవారం పరామర్శించా రు. వారు మాట్లాడుతూ ఈనెల 17వ తేదీ వినాయక నిమజ్జనంలో జానపాడుకి చెందిన ఉన్నం కోటేశ్వరరావు, యామిని వెంకటేష్, ఉన్నం నాగమల్లి వారి అనుచరులు దళితులైన కోడిరెక్క శ్రీనివాసరావు, హేమంత్‌లను కులం పేరుతో తిడుతూ దాడి చేయటం అత్యంత దారుణం అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి దురాగతాలు పునరావృతం కాకూడదని చట్టపరంగా దాడి చేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అన్నారు. ఫిర్యాదు చేసి నాలుగు రోజులు అవుతున్న ఇప్పటికీ స్థానిక సీఐ, డీఎస్పీ వారిపై ఏ చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అన్నారు.


