స్కూల్‌ బస్సు కింద పడి బాలుడు మృతి | - | Sakshi
Sakshi News home page

స్కూల్‌ బస్సు కింద పడి బాలుడు మృతి

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

లంకెలకూరపాడులో విషాదకర ఘటన కన్నీటి పర్యంతమవుతున్న తల్లిదండ్రులు

లంకెలకూరపాడు(ముప్పాళ్ల): అన్న స్కూలు బస్సు ఎక్కించి బై చెప్పేందుకు వెళ్లిన చిన్నారి ప్రాణాలను అదే స్కూల్‌ బస్సు చిదిమేసింది. ఈ హృదయ విదాయక ఘటన మండలంలోని లంకెలకూరపాడు గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొడవటి సాగర్‌బాబు, రాజకుమారి దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో పెద్ద కుమారుడు సిద్ధార్థ ముప్పాళ్ల గ్రామంలోని బ్రాటన్‌ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌లో యుకేజీ చదువుతున్నాడు. రోజులాగా స్కూలు బస్సు ఎక్కించేందుకు తల్లి రాజకుమారి సిద్ధార్థను తీసుకొని వెళ్లింది. అన్న స్కూల్‌కి వెళుతుంటే బై చెప్పేందుకు తమ్ముడు నితిన్‌(రెండున్నర సంవత్సరాలు) వెనకాలే పరిగెత్తుకుంటూ వెళుతున్నాడు. సిద్ధార్థ బస్సు ఎక్కగానే ముందుకు కదిలింది. బస్సు ముందు నిలబడి ఉన్న నితిన్‌ను గమనించని డ్రైవర్‌ గమనించకుండా ముందుకు వెళ్లాడు. నితిన్‌ బస్సు టైర్‌ కింద పడిపోయాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పెద్దగా కేకలు వేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నితిన్‌ బస్సు ముందు టైర్‌ కిందకు దూరిపోయాడు. బస్సు టైర్‌ నితిన్‌ తల వెనుక భాగంపై నుంచి వెళ్లటంతో తల పగిలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఘటనను కళ్లారా చూసిన స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. డ్రైవర్‌ పరారయ్యాడు. కళ్ల ముందే బిడ్డ మృతి చెందటాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాధచాయలు అలముకున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. తండ్రి సాగర్‌బాబు ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ.అనిల్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement