జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకుల పిలుపు
నరసరావుపేట: భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం కోసం అక్టోబర్ ఏనిమిదిన కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే మహాధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎస్.ఆంజనేయులు నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కోట ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం(సీఐటీయూ) జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రమాదంలో మృతి చెందినవారికి రూ.10లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, 55ఏళ్లు నిండిన ప్రతి ఒక్క కార్మికుడికి సంక్షేమ బోర్డు ద్వారా ఐదు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని ఈ ప్రమాదాల్లో పూర్తి అంగవైకల్యం పాక్షిక అంగవైకల్యం లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుందని వాటికి సంబంధించి సంక్షేమ బోర్డులో లబ్ధి చేకూర్చక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున పరిశీలించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డు పూర్తిస్థాయిలో పనిచయించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సిలార్ మసూద్ మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ బోర్డును వెంటనే పని చేయించకపోగా భవన నిర్మాణ కార్మికులు రెండేళ్లు అనేక రూపాల్లో ఆందోళన చేసిన ఫలితంగా మార్చి 2026 నుండి నాలుగు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. యాబైఐదేళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు పనిలోకి పిలిచే వారే ఉండరని, అటువంటి వారికి ప్రభుత్వం ఇచ్చే పెంక్షన్‌తో పాటు సంక్షేమ బోర్డు నుండి ఐదువేలు పెన్షన్ చెల్లించాలని, ప్రస్తుతం ప్రసూతి, అంత్యక్రియలకు ఇస్తున్న రూ.20వేలను రూ.50వేలకు, పెండ్లి కానుకకు ఇస్తున్న రూ.20వేలను రూ.లక్షకు పెంచి ఇవ్వాలని, తాత్కాలిక అంగ వైకల్యానికి నెలకు రూ.10వేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లతో ఈ నెల 30వ తేదీ జిల్లాలోని అన్ని సహాయ కార్మిక శాఖ కార్యాలయాలకు సామూహిక రాయబారం నడపనున్నామని, జిల్లా గౌరవ అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు, చిలక చిన్న ఏసు, కొమ్ముల సురేష్ మల్లికార్జునరావు, కాసు కోటిరెడ్డి, మీసాల జయరాజు పాల్గొన్నారు.


