టీడీపీ నేతల ధనదాహానికి చిన్నారులు బలి | - | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల ధనదాహానికి చిన్నారులు బలి

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

టీడీపీ నేతల ధనదాహానికి చిన్నారులు బలి

ఆర్‌ఆర్‌ సెంటర్‌లో విషాద ఛాయలు

● టీడీపీ నేతకు చెందిన క్వారీ

గుంతలో పడి అన్నదమ్ములు మృతి

● క్వారీ యజమాని టీడీపీ

ఎమ్మెల్యే కన్నా అనుచరుడు

● ఎడాపెడా తవ్వేస్తూ మైనింగ్‌లో

రూ.కోట్లు ఆర్జన

● గుంతలు పూడ్చకుండా వదిలేస్తున్న

వైనమే ప్రమాదాలక కారణం

● కొండమోడు ఆర్‌ఆర్‌ సెంటర్‌లో విషాద ఛాయలు

టాస్క్‌ఫోర్స్‌: అధికార పార్టీ నేతల ధనదాహం, క్వారీ యజమానుల నిర్లక్ష్యం పల్నాడు ప్రాంతంలో నిండు ప్రాణాలను బలిగొంటోంది. నిబంధనలను గాలికొదిలి విచ్చలవిడిగా తవ్వకాలు సాగిస్తున్న కొందరి దురాశ తల్లిదండ్రులకు గుండెకోత మిగుల్చుతోంది. తాజాగా పిడుగురాళ్ల మండలం కొండమోడు ప్రాంతంలో చోటు చేసుకున్న హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సోమవారం తెలుగుదేశం పార్టీ నేతకు చెందిన క్వారీ గుంతలో దిగి ఇద్దరు బాలురు మృత్యు వాత పడిన ఘటన అందరిలో విషాదంలో నింపింది.

ఘటన జరిగిందిలా..

దుర్గి మండలం, ముటుకూరు గ్రామానికి చెందిన చెవురి గాంధీ, శివ దంపతులకు ముగ్గురు కుమారులు సతీష్‌, గోపి, గౌతమ్‌. వారం రోజుల క్రితం వినాయక చవితి సందర్భంగా శివ తన భర్త, పిల్లలతో కలిసి కొండమోడు ఆర్‌.ఆర్‌. సెంటర్‌లోని తన అన్నయ్య పోలిరాజు ఇంటికి అతిథిగా వచ్చారు. సోమవారం శివ తన చిన్న అత్తయ్య, చెల్లెలు మరియు ముగ్గురు కుమారులతో కలిసి సీతారాంపురం సమీపంలోని క్వారీ గుంత వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ టీడీపీ నాయకుడు పిల్లి సుబ్బారెడ్డికి చెందిన అక్రమ క్వారీ గుంతలోకి దిగారు. ఈక్రమంలో ఒక్కసారిగా నీటిలో మునిగిపోసాగారు. పిల్లలు మునుగుతుండడం గమనించిన తల్లి శివ వారిని కాపాడేందుకు ఆవేశంగా నీటిలోకి దూకింది. ఆమె కూడా మునిగిపోతుండటంతో బంధువులు భయంతో కేకలు వేశారు. ఆ కేకలు విన్న సమీపంలోని స్థానికులు వెంటనే స్పందించి నీటిలోకి దిగి తల్లి శివతో పాటు రెండో కుమారుడు గోపిని సురక్షితంగా బయటకు లాగి ప్రాణాలు కాపాడారు. అయితే, పెద్ద కుమారుడు సతీష్‌ (14), చిన్న కుమారుడు గౌతమ్‌ (8) నీటిలో లోతుకు వెళ్లిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే వారిని 108 అంబులెన్స్‌ ద్వారా పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

టీడీపీ నేతల ధనదాహంతోనే..

స్థానిక క్వారీ యజమాని తెలుగుదేశం పార్టీ నేత పిల్లి సుబ్బారెడ్డికి టీడీపీ సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అనుచరుడు. నరసరావుపేట ఎంపీ లావు కష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావులతోనూ మంచి అనుబంధం ఉంది. వీరి అండ చూసుకొనే క్వారీ పనులు నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గురజాల ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై అనేక విమర్శలు, కేసులు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ ప్రాంతంలో అనుమతులు పొందిన మైనింగ్‌, క్వారీ యజమానులు నిబంధనల ప్రకారం గనుల తవ్వకం పూర్తయిన తర్వాత ఆ గుంతలను పూడ్చివేయాల్సి ఉంటుంది. కానీ, నిబంధనలను బేఖాతరు చేస్తూ కోట్లాది రూపాయల ఖనిజాన్ని దోచుకుంటున్న యజమానులు.. తవ్వకాలు ముగిసిన తర్వాత ఆ మహా గుంతలను అలాగే వదిలేస్తున్నారు. కనీసం చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడం గానీ, ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టడం గానీ చేయడం లేదు. ఫలితంగా లోతు గుంతలు వర్షపు నీటితో నిండి మృత్యు నిలయాలుగా మారుతున్నాయి. లోతు తెలియక అమాయక ప్రజలు అందులో దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

నిద్రమత్తులో అధికారులు

నిత్యం ప్రాణాలను హరిస్తున్న ఈ క్వారీ గుంతలను పూడ్చాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారుల్లో స్పందన లేదని స్థానికులు వాపోతున్నారు. మైనింగ్‌ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న క్వారీ యజమానులపై, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

టీడీపీ నాయకుడు పిల్లి సుబ్బారెడ్డికి చెందిన క్వారీలో పడి ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోవడం కుటుంబం సభ్యులను శోక సంద్రంలో ముంచెత్తింది. పుట్టింటికి సంతోషంగా వచ్చిన చెల్లి ఇంట ఈ అనూహ్య విషాదం చోటుచేసుకోవడం అన్న కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు కమ్ముకున్నాయి. తన కళ్లెదుటే ఊపిరిలొదిన చిన్నారుల మృతదేహాలను చూస్తూ ఆ తల్లి పడే వేదన చూపరులచే కంటతడి పెట్టించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement