జిల్లా సమాచారం
అక్టోబరు 2తో ముగియనున్న మద్యం దుకాణాల లైసెన్సు కాలం పాతవారికే కట్టబెట్టేలా ఫలించిన నేతల మంత్రాంగం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వాటాలే అసలు కారణం చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో మరో ఏడాది రెన్యూవల్‌కు అవకాశం
సత్తెనపల్లి: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి.. ప్రజల సొమ్మును లూటీ చేసే రీతిలో రాష్ట్రంలో మద్యం వ్యాపారం సాగుతోంది. మద్యం దుకాణాల లైసెన్సు గడువు ఈ నెలతో ముగుస్తోంది. కానీ, ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాకుండా పాత సిండికేటుకే మరో ఏడాది కట్టబెడుతూ రెన్యూవల్‌కు అవకాశం ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుకాణదారులు నష్టపోయారంటూ తప్పుడు ప్రచారాన్ని తెరమీదకు తెచ్చారు. మళ్లీ వారికే ఏడాది పాటు లైసెన్సులు రెన్యూవల్ చేసేందుకు సిద్ధం కావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జిల్లాలో 129 మద్యం దుకాణాలున్నాయి. ఇవన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత రెండేళ్లకుగాను ఈ దుకాణాలకు లాటరీ విధానంలో లైసెన్సు ఇచ్చిన విషయం తెలిసిందే. వీటిలో గీత కార్మికులకు కూడా కొన్ని అప్పగించారు. ఈ దుకాణాల గడువు పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం మరో రెండేళ్లకు లాటరీ తీస్తోందనే ప్రచారం జరిగింది. కానీ మళ్లీ వారికే అవకాశం కల్పించారు. జిల్లాల్లో అధికార పార్టీ కీలక నేతల చేతుల్లోనే మద్యం దుకాణాలున్నాయి. వారందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏడాది పాటు రెన్యూవల్ చేసేలా పట్టుబట్టారు.
డీడీల నుంచే సిండికేటు...
జిల్లాలో మద్యం దుకాణాలకు 2024లో లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో దుకాణాన్ని పొందేందుకు రూ. 2 లక్షల చొప్పున డీడీలు చెల్లించారు. ఈ విధానాన్ని అడ్డం పెట్టుకుని మద్యం వ్యాపారులు అప్పట్లోనే సిండికేటుగా మారారు. జిల్లాలో ఓ సీనియర్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎక్కువ మంది పోటీ పడకుండా ఒక్కో దుకాణానికి ఆరుగురు మాత్రమే ధరావత్తు చెల్లించారు. ఏ ఒక్కరి పేరుతో దుకాణం వచ్చినా ఆరుగురు కలిసి భాగస్వాములుగా వ్యాపారం చేసుకునేలా రెండేళ్ల క్రితం నిర్ణయించుకున్నారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారనే విమర్శలు ఉన్నాయి.
‘స్థానిక’ ఎన్నికల నిధికి సిండికేట్ సిద్ధం....
వచ్చే నెలలో మున్సిపల్, పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మద్యం సిండికేటు ద్వారా భారీగా నిధులు సమకూర్చుకునేందుకు అధికార పార్టీ పావులు కదుపుతోందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు మద్యం దుకాణాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం వాటాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేతలే ఇప్పుడు మరో ఏడాది పాటు లైసెన్సు పొడిగించాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం లైసెన్సు గడువు పెంచుతూ ‘పచ్చ’జెండా ఊపడంతో మద్యం దుకాణదారులు రెన్యూవల్‌కు సిద్ధమయ్యారు.
సామాన్యుడిపైనే బాదుడు
మద్యం అమ్మకాల మీద ప్రభుత్వం దుకాణదారులకు 20 శాతం కమీషన్ ఇస్తామని చెప్పింది. తొలుత 9 శాతం చొప్పున కమీషన్ ఇచ్చి, తరువాత ఒకశాతం పెంచింది. తరువాత 14 శాతం చేసింది. దీనివల్ల తాము నష్టపోయామంటూ సిండికేట్లు కట్టుకథ అల్లాయి. ప్రభుత్వం కూడా ఇదే తప్పుడు ప్రచారాన్ని ప్రచారంలో పెట్టింది.
వాస్తవానికి ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌కు పదింతలు ఎక్కువగా మందుబాబుల నుంచి మద్యం సిండికేట్లు లూటీ చేశాయనే విమర్శలు ఉన్నాయి. ఎంఆర్‌పీ కన్నా అదనంగా ఎప్పటి నుంచో వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాపులకు ఇంకా అదనంగా బాదేస్తున్నారు. ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా 15 నుంచి 20 బెల్ట్ షాపులు నడుపుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనధికార పర్మిట్ రూములు, బార్ల తరహాలో ఏర్పాట్లు చేశారు. జాతీయ రహదారిలోని దాబా హోటళ్లలో సైతం విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలోని సత్తెమ్మ తల్లి గుడి వద్ద, ఆలయ సమీపంలో బహిరంగంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి.
మున్సిపాలిటీలు: 8
మండలాలు: 28
మద్యం దుకాణాలు: 129
కల్లుగీత కార్మికులకు దుకాణాలు: 13
ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ స్టేషన్లు: 10


