ముందుకుసాగని మాదిపాడు వంతెన | - | Sakshi
Sakshi News home page

ముందుకుసాగని మాదిపాడు వంతెన

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

ముందుకుసాగని మాదిపాడు వంతెన ● చంద్రబాబు ప్రభుత్వ తీరుతో ప్రజలకు అవస్థలు ● బిల్లుల చెల్లింపులో జాప్యంతోనే పనులకు ఆటంకం

అచ్చంపేట: పల్నాడు జిల్లా సరిహద్దులోని మాదిపాడు వద్ద కృష్ణానదిపై ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ చేపట్టిన వంతెన పనులు పూర్తిగా ఆగిపోయాయి. అధికారులు గతంలో చెప్పినట్లుగా ఇప్పుడు అధిక వర్షపాతాలు లేవు, కృష్ణానది పొంగి పొర్లడం లేదు, పులిచింతల ప్రాజెక్టు నుంచి అధిక జలాలను విడుదల చేయడం లేదు. కృష్ణానదిలో నీరు చాలా తక్కువగా ఉంది. ఎల్‌నినో ప్రభావంతో చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటే వంతెన నిర్మాణ పనులు చేయడానికి ఇదే సరైన సమయం. టీడీపీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వీడటం లేదు.

బిల్లులు చెల్లించడంలోనూ విఫలం

బ్రిడ్జి నిర్మాణం ఆగిపోవడానికి కారణం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడంలో జాప్యమే. బ్రిడ్జి డిజైనులో మార్పులు, చేర్పులు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకుతోడు నదికి రెండు వైపులా స్థల సేకరణలో లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్ము ఇంతవరకు అందలేదు. బ్రిడ్జి నిర్మాణం ఆరు నెలల క్రితం ఏ స్థాయిలో ఉందో, ఇప్పుడూ అదే పరిస్థితి ఉంది. మూడు, నాలుగు నెలలుగా అసలు పనులే జరగడం లేదు. వాస్తవంగా 2025 జనవరిలో ప్రారంభమైన పనులు రెండేళ్లలో, అంటే 2027 జనవరి నాటికి పూర్తి చేయాలి.

శ్రీకారం జగన్‌ హయాంలోనే...

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నడుమ రాకపోకలను సుగమనం చేసేందుకు ఇటు అచ్చంపేట, అటు ముక్త్యాల సరిహద్దులను కలుపుతూ మాదిపాడు వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేయాలన్న ఆలోచన అప్పటి ఎమ్మెల్యే నంబూరు శంకరరావు హయాంలోనే వచ్చింది. తన అభిప్రాయాన్ని అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. సీఎం సానుకూలంగా స్పందించి ఆర్‌ అండ్‌ బీ, ఇరిగేషన్‌ ఇంజినీర్లను పంపారు. అనువైన ప్రాంతాన్ని గుర్తించి, వంతెన నిర్మాణానికి అంచనాలు తయారు చేయించారు. రూ.60.54 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేయించి, జూన్‌ 12న క్రోసూరులో వర్చువల్‌గా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వెంటనే బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టేందుకు రెండు జిల్లాల సరిహద్దుల్లో ఘాట్‌ రోడ్లకు స్థల సేకరణ, డీపీఆర్‌లు తయారు చేయడం వంటి పనులు చకచకా సాగాయి. కృష్ణానదిలో 14 పిల్లర్స్‌ వేసి వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు కావాల్సిన 13.35 ఎకరాల భూమిని సేకరించారు. పల్నాడు జిల్లా మాదిపాడు వైపు 4.45 ఎకరాలు, ఎన్టీఆర్‌ జిల్లా ముక్త్యాల వైపు 9 ఎకరాల భూమిని సేకరించారు. ముక్త్యాల వైపు కిలోమీటరు, మాదిపాడు వైపు అర కిలోమీటరు రోడ్లు వేసేందుకు ప్రతిపాదనలు చేశారు.

టెండర్ల ప్రక్రియ ఇలా..

కృష్ణానదిపై అచ్చంపేట మండల సరిహద్దులోని మాదిపాడు నుంచి ముక్త్యాల సరిహద్దు వరకు కృష్ణానదిలో 14 పిల్లర్స్‌ వేసి, 600 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో వంతెన నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం నాలుగు టెండర్లను ఆహ్వానించింది. ఎన్నికల కోడ్‌ రావడంతో పనులకు ఆటంకం ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం రాగానే వల్లభనేని కన్‌స్ట్రక్షన్స్‌ టెండర్‌ దక్కించుకుంది. ఏడాదిన్నర కాలంలో కేవలం మూడు పిల్లర్స్‌ పూర్తి అయ్యాయి. మిగిలిన పనులకు మరెంత కాలం పడుతుందోనన్న అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

మూడు పిల్లర్స్‌కే పరిమితమైన మాదిపాడు బ్రిడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement