‘స్థానిక’ ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెబుదాం
ఫ్యాక్షన్ రాజకీయాలు బ్రహ్మారెడ్డి నైజం
వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలు పీఆర్కే, గౌతమ్‌రెడ్డి
మాచర్ల పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులు పంపిణీ
మాచర్ల: మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించిన చరిత్ర చంద్రబాబు, లోకేష్‌ది అని పల్నాడు జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పి. గౌతమ్‌రెడ్డి అన్నారు. ‘‘మేం సవాలు చేస్తున్నాం. మీరు ప్రభుత్వం వచ్చాక చేసిన అక్రమాలపై చర్చకు సిద్ధమా? ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. డీఎస్సీలో అక్రమాలతోపాటు ప్రజలను మోసగించిన ప్రతి విషయం మేం చర్చిస్తాం. పూర్తి ఆధారాలతో నిరూపిస్తాం. మీ డ్రామాలు ఆపండి’’ అని వారు పేర్కొన్నారు. మాచర్లలో శుక్రవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని పీఆర్కే ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలతో గుంటూరు రోడ్డులోని మహాలక్ష్మీ కోల్డ్ స్టోరేజీ వద్ద శుక్రవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.
పార్టీ శ్రేణుల ధైర్యం అభినందనీయం
ముఖ్య అతిథిగా పి. గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు అధికారంలోకి రావడానికి వంద మాయమాటలు చెప్పారని, ఆ తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నాటకాలు చేస్తున్నారని విమర్శించారు. వేలాది మందిపై అక్రమ కేసులు పెట్టించారన్నారు. తండ్రి, కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా అందరికీ జగనన్న గుండె ధైర్యమిస్తారని అన్నారు. భయపడకుండా పీఆర్కే ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు వెళ్లడం మంచి విషయమని పేర్కొన్నారు. బాధపడవద్దని, భయపడవద్దని సూచించారు. అధికార పార్టీ వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
రైతులను దగా చేసిన సీఎం
పీఆర్కే మాట్లాడుతూ.. చంద్రబాబు వరికపూడిశెల పేరుతో రైతులను మోసగించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ‘‘బ్రహ్మారెడ్డి, మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉంటేనే వరికపూడిశెల గురించి మాట్లాడాలా? 20 ఏళ్లు నియోజకవర్గాన్ని వదిలి పారిపోయావు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడం నీకు అలవాటు. ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చాక కుటుంబాలు ఊళ్లు వదిలేసి వెళ్లిపోయారు. ఇప్పటికే మా పార్టీ కార్యకర్తలు, నాయకులపై వందల కేసులు పెట్టావు. నాపైనా 16 కేసులు పెట్టించావు. ఇవన్నీ నీ ఫ్యాక్షన్ రాజకీయాలకు నిదర్శనం. నిన్ను, నీ పార్టీ కార్యకర్తలు, నాయకులే నమ్మడం లేదు. రేషన్, ఇసుక, మట్టి అన్నీ మాఫియాలు నువ్వే చేస్తున్నావు. ఇదీ.. నీ చరిత్ర. తగిన మూల్యం చెల్లిస్తావు’’ అని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం
రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ‘‘సీఎం చంద్రబాబు... నువ్వు చేసే మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఒక్క నియోజకవర్గంలో పార్టీ కోసం వేలాది మంది తరలివచ్చి జగన్, పీఆర్కేలకు జేజేలు కొడుతున్నారంటే వారికి ఎంత ఆదరణ ఉందో తెలుసుకో. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం’’ అన్నారు.


