నరసరావుపేట ఈస్ట్: కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించే ఇన్‌స్పైర్ మనక్– 2024–25 సంవత్సరానికిగాను జాతీయస్థాయి పోటీలకు జిల్లా విద్యార్థి ఎంపిక కావడంపై జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు హర్షం వ్యక్తం చేశారు. అమరావతి మండలం లేమల్లె గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థి చినరావూరి మణికంఠసాయి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావటం అభినందనీయమని తెలిపారు. డీఈఓ కార్యాలయంలో శుక్రవారం విద్యార్థి మణికంఠసాయి, గైడ్ టీచర్స్ అంకం బుజ్జిబాబు, డాక్టర్ చివుకుల సాంబశివరావులను సత్కరించారు. ఉపాధ్యాయుల సహకారంతో మణికంఠసాయి రూపొందించిన ప్రొటెక్టీవ్ హెల్మెట్ ఫర్ ప్రొఫెషన్ వెండర్స్ ప్రాజెక్ట్‌ను రాష్ట్రస్థాయి ప్రదర్శనలో అధికారులు జాతీయస్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపవిద్యాశాఖాధికారులు షేక్.సుభాని, వి.ఏసుబాబు, జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ పాల్గొన్నారు.


