జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి లభ్యం
అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జోరుగా దందా
గంజాయితో పట్టుబడ్డ టీడీపీ నాయకురాలి కుమారుడు
కేసు నుంచి తప్పించారనిపోలీసులపై ఆరోపణలు
గంజాయి నియంత్రణలో చంద్రబాబు సర్కార్ విఫలం
మత్తుకు బానిసలై చక్కని భవిష్యత్తు కోల్పోతున్న యువత
పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం..
నరసరావుపేట టౌన్: చిలకలూరిపేట పట్టణం సుగాలి కాలనీకి చెందిన పవన్‌కుమార్ నాయక్, మణిగోపాల్ నాయక్‌లు 1,300 గ్రాముల గంజాయితో ఈ నెల 9వ తేదీన పోలీసులకు పట్టుబడ్డారు. యడ్లపాడు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. జూలై 15వ తేదీన సత్తెనపల్లికి చెందిన టీడీపీ నాయకుడు షేక్ మహ్మద్ రఫీ అల్లూరి జిల్లా నుంచి 220 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా అనకాపల్లి పోలీసులు పట్టుకున్నారు. తాజాగా నరసరావుపేటలో గురువారం సాతులూరు గ్రామానికి చెందిన కంచెర్ల నాగవెంకట్, బరంపేటకు చెందిన కటారి సాయి కల్యాణ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.75 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో పట్టుబడ్డ టీడీపీ మహిళా నేత కుమారుడిని పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసు నుంచి తప్పించారన్న ఆరోపణలు వస్తున్నాయి.
దందాకు రాజకీయ అండ..
గంజాయితో పట్టుబడ్డ టీడీపీ మహిళా నేత కుమారుడికి రాజకీయ నాయకులు అండగా నిలిచారు. నిందితుడిగా ఉండాల్సిన కేసులో గంజాయి వినియోగదారుడిగా పేర్కొన్నారు. మొదట నిందితుడిగా చేర్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి మేరకు వారు నిందితుడిగా మార్చారు. రాజకీయ నాయకులు రంగప్రవేశంతో గంజాయి కేసు నీరుగారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి విక్రయించే చిన్నస్థాయి వ్యక్తులను పట్టుకోవటంతో ఈ దందా పూర్తిగా ఆగదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు జిల్లాకు ఎక్కడి నుంచి గంజాయి సరఫరా అవుతుంది? ఎన్ని చేతులు మారుతున్నాయి? వంటి మూలాలపై అధికారులు దృష్టి సారించి లోతైన దర్యాప్తు చేపట్టటం లేదు. గంజాయి విచ్చలవిడిగా లభ్యం అవటం వల్ల దాని ప్రభావం ప్రధానంగా యువతపై పడుతోంది. విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టుకొంటుకున్నారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాపై కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లాపై ప్రత్యేక నిఘా అవసరమని ప్రజలు కోరుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా దర్యాప్తు జరిగితేనే సూత్రధారులు చిక్కుతారని, సరఫరా నెట్‌వర్క్ కట్టడి చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నేరాల బాటలో...
గంజాయి, మత్తు పదార్థాలకు బానిసలైన యువత అనేక మంది నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వ్యసనపరులు ద్విచక్ర వాహనాలు, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. గురువారం నరసరావుపేట రూరల్ పోలీసులకు గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితులు ఈ కోవకు చెందిన వారే. ఓ బుల్లెట్ వాహనాన్ని చోరీ చేసి, దాన్ని అమ్మి వచ్చి సొమ్ముతో గంజాయి కొనుగోలు చేశారని వెల్లడైంది. గంజాయిని అధిక ధరకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
జిల్లాలో విచ్చలవిడి గంజాయి అమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అడపాదడపా పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేస్తున్నప్పటికీ, సరఫరా మూలాలను ఛేదించకపోవటంతో నియంత్రణ సాధ్యం కావటం లేదు. టీడీపీ నేతలు గంజాయి మాఫియా అవతారమెత్తి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిద్రావస్థ నటిస్తున్నారు. అధికార పార్టీ నాయకులే సూత్రధారులు కావటంతో దందా జిల్లాలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. యువత మత్తు వ్యసనానికి బానిసలుగా మారడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేపుతోంది. గడిచిన కొన్ని రోజుల వ్యవధిలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంజాయి పట్టుబడటం పరిస్థితికి అద్దం పడుతోంది.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి, మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నియంత్రణకు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూలల సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్ఠం చేశారు. గంజాయి, మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం రాష్ట్రంలోకి ప్రవేశించకుండా కట్టడి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెక్‌పోస్టులన్నీ ఎత్తేసి అక్రమ వ్యాపారులకు అవకాశం కల్పించారు. కొందరు టీడీపీ నాయకులు ఉపాధి మార్గంగా గంజాయి వ్యాపారాన్ని ఎంచుకున్నారు. యథేచ్ఛగా గంజాయిని ఒడిశా, విశాఖ ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేసి, వాటిని చిన్నచిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.


