కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి | - | Sakshi
Sakshi News home page

కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి

Aug 17 2026 1:35 AM | Updated on Aug 17 2026 1:35 AM

దుర్గమ్మ సన్నిధిలో వీకెండ్‌ రద్దీ మెట్రో సిటీల నుంచి భారీగా భక్తులు ఉదయం 6 గంటలకే కొండపైకి కార్లు క్యూ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం, పైగా వీకెండ్‌, మరో వైపున వివాహ సుముహుర్తాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి కనిపించింది. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చైన్నె వంటి మెట్రో సిటీల నుంచి పెద్దఎత్తున భక్తులు ఆదిదంపతులను దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఉదయం ఆరు గంటలకే కొండపైకి కార్లు క్యూ కట్టాయి. మరో వైపున ఇంద్రకీలాద్రిపై గత మూడు రోజులుగా వరుణ జపాలు, యాగాలు నిర్వహిస్తుండటంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

8 గంటల నుంచే ఘాట్‌రోడ్డుపైకి నో ఎంట్రీ..

ఉదయం నుంచే భక్తుల తాకిడి పెరగడం, భక్తుల వాహనాలతో ఘాట్‌రోడ్డులో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 8 గంటల నుంచి కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. కేవలం దేవస్థానం బస్సులను కొండపై నుంచి దుర్గాఘాట్‌ వరకు భక్తులకు అందుబాటులో ఉంచారు. మరో వైపున భక్తుల ద్విచక్ర వాహనాలతో కొండపై ఓం టర్నింగ్‌ నుంచి మొదటి మలుపు వరకు బారులు తీరి కనిపించాయి.

స్కానింగ్‌ పాయింట్‌ వద్ద తనిఖీలు

ఉదయం అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తుల నుంచి టికెట్లను ఆలయ ఈవో, చైర్మన్లు తనిఖీ చేశారు. ఆలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ఓ వ్యక్తిని ఆపిన ఈఓ అతనితో పాటు దర్శనానికి వెళుతున్న వారి నుంచి టికెట్లను చూపించాల్సిందిగా కోరారు. అయితే సదరు వ్యక్తి వ్యవహారాన్ని గత కొద్ది రోజులుగా ఈఓ స్వయంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆలయానికి సంబంధం లేని వ్యక్తులు ఎవరిని దర్శనానికి తీసుకువచ్చినా వారిని అనుమతించవద్దని సిబ్బందికి హెచ్చరికలు జారీ చేశారు.

రద్దీతో అంతరాలయం రద్దు..

నో టికెట్లు

ఆదివారం ఉదయం నుంచి భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసిన ఆలయ అధికారులు రూ. 300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు బంగారు వాకిలి దర్శనం కల్పించారు.

మరో వైపున వీఐపీలు, సిఫార్సు లేఖలపై అమ్మవారి దర్శనానికి విచ్చేసిన వారికి సైతం ఆలయ అధికారులు బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మధ్యాహ్నం మహా నివేదన తర్వాత రద్దీ మరింత అధికం కావడంతో అన్ని దర్శన టికెట్ల విక్రయాలను నిలిపివేశారు. సర్వ దర్శనం రెండు క్యూలైన్లు, రూ. 100 టికెటు క్యూలైన్‌, రూ. 300, బంగారు వాకిలితో మొత్తం 5 క్యూలైన్ల ద్వారా సుమారు మూడు గంటల పాటు నిర్విరామంగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు అన్ని క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ, పల్లకీ సేవకు డిమాండ్‌ ఎక్కువగానే కనిపించింది. శ్రావణ మాసం కావడంతో రాత్రి 9.30 గంటల వరకు భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement