రొంపిచర్ల: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్ విజయవంతంగా జరిగాయి. పాఠశాల ఆవరణలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వివిధ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులకు సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలను బాలుర, బాలికలకు వేర్వేరుగా నిర్వహించారు. పోటీలను ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ సెక్రటరీ పి.సామంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 27 మంది క్రీడాకారులను ఉమ్మడి గుంటూరు జిల్లాకు ఎంపికయ్యారు. వారిలో 14మంది బాలికలు, 13మంది బాలురు ఉన్నారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 11, 12, 13 తేదీల్లో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని సామంత్‌రెడ్డి అన్నారు. ఎంపికై న క్రీడాకారులను వ్యాయామ ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు అభినందించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు వై.సైదయ్య, వై.వి.చిరంజీవి, పి.నరసింహారెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎన్.రామకృష్ణారెడ్డి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ యిట్టె ఏడుకొండలు, పూర్వ విద్యార్థులు పిడెం హుస్సేన్, పంబా వెంకట్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


