ఈఏపీసెట్‌లో 75 శాతం సీట్లు భర్తీ అగ్రశ్రేణి కాలేజీల్లో పూర్తి స్థాయిలో చేరికలు మూడు కాలేజీల్లో 10 శాతానికి మించని ప్రవేశాలు నేటి నుంచి తుది విడత కౌన్సెలింగ్ దీనిపైనే ఆశలు పెట్టుకున్న యాజమాన్యాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్–2026 ఆధారంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన మొదటి విడత సీట్ల కేటాయింపు ముగిసింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 40 ఇంజినీరింగ్ కళాశాలలు, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 75 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఐటీ, సాంకేతిక విద్యా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, ఐటీ రంగంలో కుదుపులతో ఇంజినీరింగ్ విద్యపై ప్రభావం కనిపిస్తోంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఏపీ ఈఏపీసెట్–2026)లో అర్హత సాధించిన (ఎంపీసీ స్ట్రీమ్) విద్యార్థులకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ ద్వారా మొదటి విడతలో సీట్లు కేటాయించారు. చాలా ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయి.
అగ్రశ్రేణి కాలేజీల్లో భర్తీ
ఏపీ ఈఏపీసెట్ మొదటి విడతలోనే బీటెక్‌లో 90 శాతానికి పైగా సీట్లు భర్తీ కావాల్సి ఉండగా, 75 శాతం సీట్లు మాత్రమే భర్తీ కావడం వివిధ కళాశాలల యాజమాన్యాలకు మింగుడుపడటం లేదు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 40 ఇంజినీరింగ్ కళాశాలల పరిధిలో కేవలం రెండు అగ్రశ్రేణి కళాశాలల్లోనే నూరు శాతం ప్రవేశాలు పూర్తయ్యాయి. అదే విధంగా 15 కళాశాలల్లో 90 శాతానికి పైగా ప్రవేశాలు జరిగాయి. ఏడు కళాశాలల్లో 50 – 82, 13 కళాశాలల్లో 14– 44 శాతం మేరకే ప్రవేశాలు పూర్తయ్యాయి. మూడు కళాశాలల్లో 10 శాతంలోపే విద్యార్థులు చేరడానికి ఆసక్తి చూపారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 40 ఇంజినీరింగ్ కాలేజీల్లో అందుబాటులో ఉన్న 26,579 బీటెక్ సీట్లలో మొదటి విడతలో 19,888 సీట్లు భర్తీ అయ్యాయి. 6,691 సీట్లు భర్తీకి నోచుకోలేదు. ఫలితంగా 50 శాతం వరకు మాత్రమే ప్రవేశాలు జరిగిన కళాశాలల యాజమాన్యాలు తుది విడత కౌన్సెలింగ్‌పై ఆశలు పెట్టుకున్నాయి.
నేటి నుంచి తుది విడత
భర్తీ కాక మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు సోమవారం నుంచి తుది విడత ప్రవేశాలు చేపట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ను విడుదల చేసింది. సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగనుంది. ఈ నెల 21వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన, 22వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 23న ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఉంది. చివరి విడత సీట్ల కేటాయింపు ఈనెల 26న జరగనుంది.


