నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు దినోత్సవాన్ని ఆదివారం పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ సంఘాన్ని 2010 సంవత్సరంలో ఏర్పాటు చేయగా, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని 2019 ఆగస్ట్ 16వ తేదీన ప్రభుత్వ గుర్తింపు పొందిందని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, న్యాయమైన కోర్కెల సాధనకు సంఘం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావలసిన ఐదు డీఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు, ఐఆర్ విడుదల, పీఆర్సీ కమిషన్ నియామకం చేపట్టాలని సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. వీఆర్‌ఓ, జూనియర్ అధ్యాపకుల ప్రమోషన్‌పై సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ నిరంతరం కృషి చేసి సాధించారని హర్షం వ్యక్తం చేశారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి చుక్కా వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీ ఎస్.సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణయ్య, మహిళా ప్రతినిధులు ఎం.ఫ్లారెన్స్, లక్ష్మీజ్యోతి, ఎన్.సూర్యకుమారి, షేక్.బాజీబాబు, కంపాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


