అడుగంటిన శింగర చెరువు ముందే తెలిసినా చర్యలు చేపట్టని పురపాలక అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు
వినుకొండ: పురపాలక అధికారుల బాధ్యతారాహిత్యం, ముందస్తు ప్రణాళిక లేమి వినుకొండ పట్టణ ప్రజలకు శాపంగా మారింది. వేసవి రాకముందే నీటి ఎద్దడి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పట్టణంలో తాగునీటి ముప్పు ముంచుకొచ్చింది. ప్రజలకు మంచినీరు సరఫరా చేసే ప్రధాన వనరైన శింగరచెరువులో నీటి నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడం అధికారుల ఉదాసీనతకు అద్దం పడుతోంది. చెరువులో నీటి మట్టం రోజురోజుకూ పడిపోతున్నా అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి నిల్వలు అడుగంటి, పరిస్థితి చెయ్యి దాటే వరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన యంత్రాంగం.. ఇప్పుడు కేవలం వారం లేదా పది రోజులకు మాత్రమే నీరు వస్తుందని చేతులెత్తేయడం వారి నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ప్రస్తుతం పట్టణంలో నాలుగు రోజులకోసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ఆ ఇచ్చే కాస్త నీరు కూడా కుటుంబ అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదు. మరోవైపు చెరువులో ఉన్న నీరు వారంలో ఖాళీ అయితే, ఆ తర్వాత ప్రజల దాహార్తిని ఎలా తీరుస్తారనే దానికి అధికారుల వద్ద ఎలాంటి స్పష్టమైన సమాధానం లేదు.


