ఫార్మాసిస్టు లేకుంటే ప్రమాదమే!
విచారించి చర్యలు తీసుకుంటాం
● జిల్లాలో పలు మెడికల్
దుకాణాల్లో ఇష్టారాజ్యం
● డాక్టర్ రాసిన మందుల
చీటీ లేకుండానే విక్రయాలు
● ఫార్మాసిస్టులూ లేకుండా
అక్రమంగా అమ్మకాలు
● అనుమతులు ఒకరి పేరుతో..
నడిచేది మరొకరి చేతిలో..
● లైసెన్సులు లేకుండా నడుస్తున్న
కొన్ని మందుల దుకాణాలు
● చోద్యం చూస్తున్న ఔషధ
నియంత్రణ శాఖ
● తనిఖీల ఊసే ఎత్తని డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు
● ప్రాణాలతో చెలగాటం
అంటూ ప్రజల మండిపాటు
నరసరావుపేట టౌన్ : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఔషధ దుకాణాల్లో యథేచ్ఛగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లైసెన్స్ నిబంధనలను పక్కనబెట్టి కొందరు మెడికల్ షాపులను నిర్వహిస్తుండగా వాటిపై చర్యలు తీసుకోవాల్సిన ఔషద నియంత్రణ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అనేక ఔషధ దుకాణాల్లో అర్హత కలిగిన ఫార్మాసిస్టులు అందుబాటులో లేకుండానే మందుల విక్రయాలు జరుగుతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ ఫార్మాసిస్టు పర్యవేక్షణలోనే మందులు విక్రయించాల్సి ఉన్నా, క్షేత్రస్థాయిలో దుకాణాల్లో ఫార్మాసిస్టు కనిపించరు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం ప్రకారం మెడికల్ షాపు లైసెన్స్ అర్హత కలిగిన రిజిస్టర్డ్ ఫార్మాసిస్ట్ పేరుపైనే ఉండాలి. మందుల విక్రయాలు కూడా వారి పర్యవేక్షణలోనే కొసాగాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నం. లైసెన్స్ ఒకరి పేరుపై ఉండగా వ్యాపారం మరొకరు నిర్వహిస్తున్న ఘటనలు అధికంగా ఉన్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయించడం, జనరిక్ మందుల ధరల్లో ఇష్టారాజ్యం వంటి అంశాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
సర్టిఫికెట్లతో వ్యాపారం..
ఫార్మసీ విద్య పూర్తి చేసిన కొందరి సర్టిఫికెట్లను ఉపయోగించుకొని కొందరు మెడికల్ షాపుల లైసెన్స్‌లు పొందుతున్నారన్నా ఆరోపణలు ఉన్నాయి. సర్టిఫికెట్ ఇచ్చిన వారికి ఒకేసారి పెద్ద మొత్తం, ఆ తర్వాత ప్రతి నెలా నిర్ణయించిన పారితోషికం చెల్లిస్తున్నట్లు ప్రచా రం జరుగుతోంది. దీంతో షాపు లైసెన్స్ ఒకరిది.. నిర్వహణ మరొకరిదిగా మారింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా అధికారులు నుంచి స్పందన ఉండటం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతు న్నాయి. ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేపడితే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు..
వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీ బయోటిక్స్, స్టెరాయిడ్స్, నిద్రమాత్రలతో పాటు షెడ్యూల్–హెచ్, షెడ్యూల్–ఎక్స్ వంటి నియంత్రిత ఔషధాలను విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు అధికంగా ఉన్నాయి. ఈ చర్య ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందుల దుర్వినియోగం వల్ల అనర్థాలు చోటు చేసుకునే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెల గాటం ఆడే ఇటువంటి విక్రయాలపై ప్రత్యేక నిఘా అవసరం అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధిక ధరలకు విక్రయాలు
ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనరిక్ ఔషధాలను ప్రోత్సహిస్తున్నాయి. కానీ కొందరు వ్యాపారులు వాటిని ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వినియోగదారులకు బిల్లు ఇవ్వకుండా విక్రయాలు నిర్వహించడం వల్ల ధరలపై ప్రశ్నించే అవకాశం కూడా లేకుండా పోతోందని బాధితులు అంటున్నారు. కొన్ని దుకాణాల్లో గడువు ముగిసిన మందులను విక్రయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. తెలియక వాటిని వినియోగించి ఇప్పటికే అనేక మంది అరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడినట్లు తెలుస్తొంది.
మెడికల్ దుకాణల నిర్వహణ తప్పనిసరిగా రిజిస్టర్ ఫార్మాసిస్టుల పర్యవేక్షణలోనే జరగాలి. ఫార్మాసిస్టులు లేకుండా మెడికల్ దుకాణాలు నిర్వహించటం లేదా మరొకరి సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని దుకాణాలు నడపటం చట్టరీత్యా నేరం. అటువంటి వారిపై విచారణ జరిపి లైసెన్స్‌లు రద్దు చేస్తాం.
– పర్వీన్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, నరసరావుపేట
ఫార్మాసిస్టులు కేవలం మందులు ఇవ్వటమే కాదు. వైద్యులు సూచించిన మందులను సరిగ్గా గుర్తించటం, మోతాదు వివరించటం, ఇతర మందులతో కలిపి వినియోగించ వచ్చా లేదా చెప్పటం, గడువు తేదీ, నిల్వ విధానం వంటి అంశాలపై రోగికి అవగాహనం కల్పించటం కూడా వారి బాధ్యతల్లో భాగమే. ఫార్మాసిస్ట్ లేకుండా అర్హత లేని వ్యక్తులు మందులు ఇవ్వటం వల్ల తప్పు జరిగితే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని అధికశాతం మెడికల్ షాపుల్లోని కౌంటర్ల వద్ద సేల్స్‌మెన్ లేదా యజమానే మందులు ఇస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయని వినియోగదారులు చెప్పుకొస్తున్నారు. రిజిస్టర్డ్ ఫార్మాసిస్టు విధుల్లో ఉన్నారా? లేదా? అనే వివరాలను ప్రదర్శించాల్సిన నిబంధనలను కూడా చాలా చోట్ల పాటించడం లేదు. ఔషధ దుకాణాల్లో ఫార్మాసిస్టు లేకుండా బహిరంగంగా విక్రయాలు నిర్వహిస్తున్న సంబంధిత శాఖ అధికారులు స్పందించక పోవటం వస్తున్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతుంది.
జిల్లాలో సుమారు 300 హోల్‌సేల్, 500 రిటైల్ ఔషధ దుకాణాలు ఉన్నాయి. వీటిలో 80 శాతం దుకాణాల్లో ఫార్మసిస్టులు ఉండరు. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు నిబంధనల ప్రకారం క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. షాపులో ఫార్మసిస్టు ఉన్నారా.. ప్రిస్కిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్నారా.. నిబంధనల ప్రకారమే దుకాణాలు కొనసాగుతున్నాయా అనే అంశాలపై పరిశీలించాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో అలాంటి తనిఖీలు మచ్చుకై నా కానరావని ప్రజలు చర్చించుకుంటున్నారు.


