కార్మిక, రైతు సంఘాల నిరసన | - | Sakshi
Sakshi News home page

కార్మిక, రైతు సంఘాల నిరసన

Aug 11 2026 1:36 AM | Updated on Aug 11 2026 1:36 AM

కార్మిక, రైతు సంఘాల నిరసన బ్యాటరీ వాహనాలకు అనుమతి ఇవ్వండి ఆత్మహత్య చేసుకున్న మహిళ మృతి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు మృతి

వామపక్ష పార్టీల జైల్‌ భరో పలువురు నాయకులు అరెస్ట్‌.. విడుదల

నరసరావుపేట రూరల్‌: దేశ వ్యాప్తంగా రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ క్విట్‌ ఇండియా ఉద్యమస్ఫూర్తితో కార్మిక, రైతు, కౌలు రైతు సమన్వయ సమితి దేశ వ్యాపిత పిలుపులో భాగంగా సోమవారం ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించటం, సమాన పనికి సమాన వేతనం, ఉపాధి హామీ పధకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తూ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని తెలిపారు. దేశంలో ప్రతి ఏడాది 10వేలకు పైగా రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను దారుణంగా మోసగించారని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్‌ రెండవ స్థానంలో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైటాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినదించారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తటంతో పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తగత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ, ఉలవలపూడి రాము, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎస్‌.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునకొండ మ్యూజియానికి మంజూరైన రెండు బ్యాటరీ వాహనాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అవసరమైన అనుమతులను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ అఖిల భారత పంచాయతీ పరిషత్‌ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షులు, పల్నాడు జిల్లా పర్యాటక అభివృద్ధి మండలి సభ్యులు డాక్టర్‌ జాస్తి వీరాంజనేయులు సోమవారం (న్యూఢిల్లీ) తిలక్‌ మార్గ్‌లో ఉన్న కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రవీణ్‌ కుమార్‌ త్రిపాఠి సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన అవసరమైన అనుమతులు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చిలకలూరిపేటటౌన్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వివాహిత మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన మూకిరి సుభాషిణి(38) ఇంటికి తూర్పుమాలపల్లిలో నివాసం ఉండే ఆమె తల్లి ఈనెల 5వ తేదీన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది. తల్లి మాటలకు మనస్థాపం చెందిన సుభాషిణి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల పేస్టు తినింది. మర్నాడు వాంతులు చేసుకోవడం చూసిన సుభాషిణి భర్త సాల్మన్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇరువురు సంతానం ఉన్నారు.

చిలకలూరిపేటటౌన్‌: రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సోమవారం మృతి చెందాడు. అర్బన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని గంగన్నపాలెంకు చెందిన టైల్స్‌ పనులు చేస్తూ జీవనం సాగించే గండు గోపీ(23) గ్రామం ఆదివారం రాత్రి బైక్‌పై చిలకలూరిపేటకు వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నాడు. తీవ్రగాయాలైన అతన్ని స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గోపీ తండ్రి ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుకు మేరకు అర్బన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement