జిల్లా సమాచారం ఇదీ...
విద్యుత్ బిల్లుల భారం..
అంగన్‌వాడీ కేంద్రాలకు స్టౌల పంపిణీ
గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిపివేత
కరెంట్ పోతే వంటకు ఆటంకాలు
తడిసి మోపెడవుతున్న విద్యుత్ బిల్లులు
పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు
సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టౌల రూపంలో కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. అంగన్‌వాడీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లుగా ప్రకటిస్తూ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్‌కు కొరత ఏర్పడడాన్ని సాకుగా చూపుతూ ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టౌలను పంపిణీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే అంగన్‌వాడీల పరిస్థితి పొయ్యిలో నుంచి పెనం మీద పడినట్లుగా తయారైంది. కరెంటు పోతే ఇండక్షన్ స్టౌ పనిచేయకపోవడంతో వంటకు ఆటంకం ఎదురవుతోందని, విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరెంట్ పోతే వంట బంద్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు రెండు విడతల వారీగా ఇండక్షన్ స్టౌలను పంపిణీ చేయడం ఆరంభించింది. తొలుత జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీలకు పంపిణీ చేశారు. రెండో విడత మిగిలిన ఆరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీలకు ఇండక్షన్ స్టౌల పంపిణీ పూర్తి చేశారు. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఉన్న 2,031 అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టౌలపైన వంటచేసి పోషకాహారం వడ్డించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ముందస్తు సమాచారం లేకుండానే విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు. సరిగ్గా చిన్నారులకు వంట చేసే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండడంతో సకాలంలో పిల్లలకు భోజనాలు వడ్డించలేక అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వంట పాత్రలతోనూ అగచాట్లే..
గ్యాస్ స్టౌపై అయితే ఏ పాత్రలైనా పని చేస్తాయి. ఇండక్షన్ స్టౌపై అన్ని పాత్రలు పనిచేయవు. ఇండక్షన్ బేస్ లేదా అడుగు భాగంలో కాపర్ ఉన్న పాత్రలు మాత్రమే ఉపయోగించాలి. గ్యాస్ స్టౌపై ఎంత పెద్ద పాత్రలైనా పెట్టి వంట చేసేవారు. ఇండక్షన్ స్టౌలపై భారీ పాత్రలు పెట్టి వంట చేసే పరిస్థితి లేకపోవడంతో అంగన్‌వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు ఇండక్షన్ స్టౌపై వంట చేస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే మళ్లీ కట్టెల పొయ్యిలపై కుస్తీ పట్టాల్సిందేనని అంగన్‌వాడీలు వాపోతున్నారు. మరోవైపు ఇండక్షన్ స్టౌ పాడైతే గ్రామీణ ప్రాంతాల్లో మరమ్మతులు చేసే నాథుడే లేడు. పట్టణాలకు తీసుకెళ్లి బాగు చేయించాలంటే కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది. ఆ సమయంలో పిల్లల ఆకలి ఎలా తీర్చాలని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు.
గ్యాస్ సిలిండర్లు ఏమైనట్లు?
గతంలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు వంటగ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేవారు. ఇందుకు గాను ఆయా కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తల పేరుతో సిలిండర్లు బుక్ చేసి డెలివరీ చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. గతేడాది నుంచి గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయడం లేదు. గ్యాస్ సిలిండర్లను బుక్ చేయకపోతే ఏజెన్సీలు కనెక్షన్లు రద్దు చేశారా? ఇంకేమైనా జరిగిందా? అనే విషయం కూడా గోప్యంగా ఉంచేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2,031 గ్యాస్ సిలిండర్లు ఏమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లు : 09
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు : 2,031
6–3 ఏళ్ల చిన్నారులు : 50,055 మంది
3–6 ఏళ్ల చిన్నారులు : 37,387 మంది
గర్భిణులు : 10,250 మంది
బాలింతలు : 8,743 మంది
పంపిణీ చేసిన ఇండక్షన్ స్టౌలు : 2,031
ఇండక్షన్ స్టౌ పంపిణీ చేసిన తర్వాత ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికి విద్యుత్ బిల్లుల కోసం నెలకు రూ. 500 ఇస్తామని ప్రభుత్వం చెబుతూనే, దానిని అద్దె మొత్తంలో నుంచి చెల్లించాలని చెబుతోంది. అయితే అంగన్‌వాడీ కేంద్రంలో ఒక ఫ్యాను, ట్యూబ్‌లైట్ ఉంటే నెలకు కనీసం రూ.400 నుంచి రూ.500 వరకు బిల్లు వస్తుంది. ప్రస్తుతం ఇండక్షన్ స్టౌపై వంట చేస్తే రోజుకు కనీసం అరగంట పాటు వినియోగిస్తే విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతాయని, వాటిని తామే చెల్లించుకోవాలంటే కష్టమవుతుందని అంగన్‌వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చిన రీతిలో అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా ఉచిత విద్యుత్ అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


