శావల్యాపురం: ఉపాధి శ్రామికులకు పనులు కల్పించాలని డ్వామా పీడీ సిద్ధా లింగమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి అధికారులతో సమావేశం నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ఎల్‌నివో ప్రభావం మూడు నెలలపాటు ఉంటుందని గ్రామాల్లో జాబ్ కార్డులు ఉన్న వారందరికి పనులు కల్పించే బాధ్యత ఆయా గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్స్‌పై ఉందన్నారు. విధుల్లో అలసత్వం వహించిన వారిని మొదట దశలో షోకాజ్ నోటీస్ జారీ చేస్తామని, మరలా పునరావృతమైతే అటువంటి వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చారించారు. గ్రామాల్లో ఉపాధి శ్రామికులకు పూర్తిస్థాయిలో పనులు కల్పించటం లేదని ఫిర్యాదులు రావడంతో మండలంలోని వయ్యకల్లు, పోట్లూరు గ్రామ పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా కలెక్టరు అమోదించిన అనంతరం అన్ని గ్రామాల్లో వీబీ జీ రామ్‌జీ పథకం ద్వారా అందరికి పనులు కల్పిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 40 వేల మంది పనిదినాలు కల్పించాల్సి ఉండగా 20 వేల మంది పనులు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో పేరుమీనా సీతారామయ్య, ఏపీడీ ఈవూరి బూసిరెడ్డి, ఏపీవో సుధాకర్,టీఏలు లావణ్య, ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.
పీడీ సిద్ధా లింగమూర్తి


