నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో ఆగస్ట్ 3వ తేదీ ఘటాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు విస్తారంగా వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
అమరావతి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అమరావతిని గురువారం తైవాన్ ప్రతినిధుల బృందం సందర్శించింది. తహసీల్దార్ డానియేల్ పర్యవేక్షణలో చైన్నెలోని తైపే ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ జనరల్ స్టీఫెన్ హ్సు, డైరెక్టర్ డెన్నిస్ త్సాయ్, డిప్యూటీ డైరెక్టర్ ఎరిక్ చావోలు అమరావతి పురావస్తు మ్యూజియం, అమరావతి స్తూపాన్ని తిలకించారు. అనంతరం ధ్యానబుద్ధ విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తైవాన్ ప్రతినిధులకు అమరావతి మెడిటేషన్ టెంపుల్ ప్రతినిధి ధర్మానంద.. ధ్యానబుద్ధ ప్రాజెక్టు విశిష్టతను, అమరావతి చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. అనంతరం ధ్యానబుద్ధ ప్రాజెక్టులో బుద్ధునికి పూజలు నిర్వహించారు. బుద్ధుని జీవిత విశేషాలను తెలిపే శిల్పాల గురించి అడిగి తెలుసుకున్నారు. ధ్యానబుద్ధ విగ్రహాన్ని తిలకించిన స్టీఫెన్ హ్సు ప్రత్యేకంగా ఫొటోలు దిగడం విశేషం. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశ సాంస్కృతిక వైభవం ఎంతగానో ఆకట్టుకుందన్నారు. చారిత్రక విశేషాలను తైవాన్ దేశస్థులు తెలుసుకునేలా కృషి జరగాలన్నారు. ఇండియా, తైవాన్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ సందర్శనలో వారి వెంట పురావస్తు శాఖ అధికారులు సూర్యప్రకాశ్, నాగేంద్ర కుమార్, జిల్లా పర్యాటక అధికారి నాయుడమ్మ, ఎంపీడీవో శివపార్వతి, ఏపీటీడీసీ అమరావతి యూనిట్ మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు లీగల్. గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం మహిళా న్యాయవాదులకు చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొదటి స్థానంలో కె.దివ్య, రెండవ స్థానంలో ఎస్.తేజస్విని నిలిచారు. మహిళల క్యారమ్స్ సింగిల్స్ విభాగంలో మొదటి స్థానంలో కె.దివ్య, రెండవ స్థానంలో పి.కళ్యాణి, విజేతలుగా నిలిచారు. గుంటూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మదిర నాగేశ్వరరావు విజేతలను అభినందించారు. క్రీడా పోటీలు మహిళా న్యాయవాదుల్లో ఐక్యత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని పలువురు సభ్యులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమాన్ని స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కుప్పల హనుమంతరావు ఈసీ మెంబెర్ రాయపూడి శ్రీను, ట్రెజరర్ ఆకుల సుజాత, ఈసీ మెంబర్స్ ఈ పోటీలను పర్యవేక్షిస్తున్నారు.
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలో జూన్ 2026న జరిగిన రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఎ. వెంకటేశ్వర్లు గురువారం పేర్కొన్నారు. బీ ఫార్మసీ పరీక్షలకు 1,591 మంది హాజరు కాగా 1,518 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంఈడీ 4వ సెమిస్టర్ పరీక్షలకు 187 మందికిగాను 133 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎంబీఏ ఇంటర్నేషనల్ బిజినెస్ నాల్గవ సెమిస్టర్‌కు 52 మందికిగాను 51 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎంఏ ఇంటెగ్రేటెడ్ పబ్లిక్ పాలసీ ఆరవ సెమిస్టర్, ఎంఏ ఎకనామిక్స్ 4వ సెమిస్టర్, సోషియాలజీ 4వ సెమిస్టర్, మాస్ట్టర్ ఆఫ్ సోషల్ వర్క్ 4వ సెమిస్టర్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్‌కు ఆగస్టు 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.


