నరసరావుపేట: జిల్లాలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించేందుకు రైస్ మిల్లర్ల సహకారంతో నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, దాచేపల్లి, పిడుగురాళ్ల, నకరికల్లు, మాచర్ల, గురజాలలో ప్రత్యేక కౌంటర్లు ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి ఎంవి.ప్రసాద్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో రైస్‌మిల్లర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. సూపర్ పైన్ రైస్, స్టీమ్డ్ రైస్ (బీపీటీ) కేజీ రూ.52 చొప్పున, రా రైస్ బీపీటీ కేజీ రూ.50 ధరలపై విక్రయాలు జరుపుతారన్నారు. రైతు బజార్లు, రైస్ మిల్లుల్లో కూడా ఇదే ధరలపై లభిస్తాయన్నారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డీఆర్‌ఓ అద్దెయ్య, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఊర భాస్కరరావు పాల్గొన్నారు.
యడ్లపాడు: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు రెవెన్యూ పరిధిలోని చౌడవరం కొండ పోరంబోకు భూముల్లో జిల్లా కారాగార ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక నాయకులతో కలిసి జైలు నిర్మాణానికి అనుకూల స్థలాన్ని పరిశీలించారు. 44 ఎకరాల ప్రభుత్వ భూమిలో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను అధికారులతో కలిసి సమీక్షించారు.


