నరసరావుపేట టౌన్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ రాజమోహన్‌రావు ఆదివారం తెలిపారు. రైల్వే పోలీస్ పరిధిలోని సంతమాగులూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు పక్కన సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడన్నా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. మృతదేహం ఆనవాళ్లను బట్టి రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు రైల్వే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.
నాదెండ్ల: ప్రమాదవశాత్తూ కాలుజారి పడిన యువకుడు దుర్మరణం పాలైన సంఘటన కనపర్రు శివారు మల్లాయపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మల్లాయపాలెం గ్రామానికి చెందిన దార్ల కిరణ్‌కుమార్ (31) నరసరావుపేటలో ట్రావెల్స్ ఏజెన్సీలో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లిన కిరణ్ కాలుజారి చెరువులో పడ్డాడు. స్థానిక రైతులు చూసి చెరువులో పడిన కిరణ్‌ను బయటకు తీసి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించేలోగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య వందన, నాలుగేళ్ల కుమారుడు మోహన్‌రాయ్, మూడు వారాల కిందట జన్మించిన కుమార్తె ఉన్నారు. భార్య వందన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇద్దరు గన్‌మెన్లతో ఇన్నోవా కారులో తిరుగుతూ మోసాలు
ఒంగోలు టౌన్: సైబర్ క్రైంలో డబ్బులు పోగొట్టుకున్న బాధితుడికి నేను డీఎస్పీగా పనిచేస్తున్నాను..నీ డబ్బులు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఒక నకిలీ డీఎస్పీ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన గ్రానైట్ వ్యాపారి ముంగులూరి రఘుపతికి ఇన్‌స్ట్రాగాంలో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. కొంతకాలం స్నేహంగా నటించిన సదరు వ్యక్తి ఆన్‌లైన్ యాప్‌లో పెట్టుబడులు పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపారు. అతడి మాయమాటలు నమ్మిన రఘుపతి విడతల వారీగా రూ.1.23 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత ఫోన్ స్విచాఫ్ కావడంతో మోసపోయినట్లు గ్రహించిన రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంలో పోలీసుస్టేషన్ చుట్టూ తిరుగుతున్న క్రమంలో నరసరావుపేటకు చెందిన కొత్తపల్లి ప్రదీప్ పరిచయమయ్యాడు. తాను సైబర్ క్రైంలో డీఎస్పీగా చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్న ప్రదీప్ నువ్వు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఇందుకుగాను రూ.5 లక్షల నగదు, బుల్లెట్ తీసుకున్నాడు. అయితే రోజులు గడుస్తున్నా తన డబ్బులు రాకపోవడంతో ప్రదీప్ మోసం చేసినట్లు గ్రహించిన రఘుపతి విచారించడంతో అసలు విషయం బయటపడింది. దాంతో ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శనివారం రాత్రి ప్రదీప్ మీద కేసు నమోదు చేశారు.
పోలీసులకు శిక్షణ ఇచ్చిన ప్రదీప్...
నరసరావుపేటకు చెందిన కొత్తపల్లి ప్రదీప్, అతడి సోదరుడితో కలిసి సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతుంటాడని సమాచారం. అంతేకాకుండా ఏడాది క్రితం ఒంగోలు పోలీసులకు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకొని తెరవెనుక నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. పోలీసు శాఖలో సైబర్ డీఎస్పీగా చేస్తున్నట్లు నమ్మించి పలువురి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక ఇన్నోవా కారులో ఇద్దరు ప్రైవేటు గన్‌మెన్లను పెట్టుకొని తిరుగుతుంటాడని చెబుతున్నారు.


