తల్లికి వందనం ఏది బాబూ..? | - | Sakshi
Sakshi News home page

తల్లికి వందనం ఏది బాబూ..?

Jul 27 2026 1:54 AM | Updated on Jul 27 2026 1:54 AM

తల్లికి వందనం ఏది బాబూ..?

ఒకే కుటుంబంలో నలుగురు పిల్లలు అందరూ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం తల్లిదండ్రులు పేద కౌలు రైతులు తల్లికి వందనం అర్హుల జాబితాలో పేరు లేని వైనం

పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు

బొల్లాపల్లి: ఆ కుటుంబంలో ఉద్యోగులు లేరు... పన్ను చెల్లింపుదారులు కానరారు. విద్యుత్‌ బిల్లులు అసలే లేవు. కానీ తల్లికి వందనం పథకం మాత్రం వర్తించదు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గండిగనముల గ్రామానికి చెందిన నీనావతు బాలకోటి నాయక్‌, పద్మాబాయి దంపతులకు నలుగురు సంతానం. వీరు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. పెద్ద కుమార్తె హర్షిణి 6వ తరగతి, గోపిక, దీపిక లు (కవలలు) వినుకొండ పట్టణంలోని ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్లో 4వ తరగతి , కుమారుడు జోగేశ్వరరావు నాయక్‌ స్థానిక గండిగనుమల గ్రామంలో రెండో తరగతి చదువుతున్నారు. అయితే తల్లికి వందనం పథకం అర్హుల జాబితాలో ఒక్కరి పేరూ లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అదేమని అధికారులను అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ఇచ్చారని, అప్పట్లో లేని నిబంధనలు ఇప్పుడు ఎలా వచ్చాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

మాది పేద కుటుంబం. రెక్కల కష్టంపై ఆధారపడి పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. సొంతం అర ఎకరం పొలంతోపాటు మరో ఎకరన్నర పొలం కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాం. ఉద్యోగుల కుటుంబం కాదు, ఇతరత్రా పన్ను చెల్లింపులు లేవు. 200 యూనిట్లలోపు ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్‌ పథకం కింద ఉన్నాం కాబట్టి కరెంటు బిల్లులు లేవు. కానీ తల్లికి వందనం అర్హుల జాబితాలో పేరు లేదు. ప్రభుత్వం అర్హత గల ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ఇస్తామన్నారు. పలుమార్లు అధికారులను దీనిపై అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం వచ్చింది. ఇప్పుడెందుకు రాలేదో అర్ధం కావడం లేదు. అధికారులు న్యాయం చేయాలి.

– నీనావతు బాలకోటి నాయక్‌, పద్మాబాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement