సత్తెనపల్లి: రానున్న శాసనమండలి ఎన్నికలలో కృష్ణా–గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి ఎస్టీయూ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రజ్ఞ కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో శనివారం రాత్రి జరిగిన ఎస్టీయూ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. సమావేశానికి ఎస్టీయూ సత్తెనపల్లి ఏరియా కార్యదర్శి వల్లూరి నాగరాజు అధ్యక్షత వహించారు. జోసెఫ్ సుధీర్‌బాబు మాట్లాడుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్‌గా, రాష్ట్ర ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ గా వివిధ హోదాల్లో మూడు దశాబ్దాల పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం ఐదుగురు ముఖ్యమంత్రులకు ప్రాతినిధ్యాలు చేయడమే కాకుండా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. ఎస్టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఉద్యమ నేపథ్యం, విద్యారంగ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సుధీర్ బాబును గెలిపిస్తే శాసనమండలిలో సైతం ఉపాధ్యాయ వాణిని వినిపించి ఉద్యోగుల హక్కులను పరిరక్షించగలరన్నారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండి, ఆర్థిక కార్యదర్శి షేక్ మహబూబ్ సుభాని, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.ఎం.సుభానీ, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి కుంభా రామలింగయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు కోలా యేసయ్య, పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కెబీఆర్‌జే .ప్రసాద్ , ఎస్టీయూ మాజీ నాయకుడు సలగాల మృత్యుంజయరావు, ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సురేష్, కార్యదర్శి తురకా రాజు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జె.వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఒకరి పరిస్థితి విషమం
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని విజయ బ్యాంక్ సెంటర్ సమీప హైవేపై శనివారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భూక్యా శ్రీసాయితోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు శ్రీసాయి తలకు బలమైన గాయమై చెవుల్లోంచి రక్తం కారడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అర్బన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైన వాహనాల్ని తొలగించి ట్రాఫిక్‌ను నియంత్రించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


