మూడు దశాబ్దాల తర్వాత పురాతన హజరత్ సయ్యద్ షా ఔలియా రహమతుల్లా దర్గాలో ఉత్సవాలు
యడ్లపాడు: చారిత్రక కొండవీడుకోట కొండలపై వెలసిన పురాతన హజరత్ సయ్యద్ షా ఔలియా రహమతుల్లా బాబా దర్గా ఆదివారం భక్తజన సందోహంతో కళకళలాడింది. కొండపైకి సరైన మార్గం లేక దాదాపు మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన ఉరుసు ఉత్సవాలు, మళ్లీ అత్యంత వైభవంగా పునఃప్రారంభం కావడం భక్తుల్లో ఆనందోత్సాహాలు నింపింది. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న ఈ ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి.
ఉదయం నుంచే ఉత్సవాలు..
ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకుని బాబావారిని దర్శించుకున్నారు. ఫకీర్లు ఇస్లామీయ భక్తిగీతాలు ఆలపిస్తూ, మేళతాళాల నడుమ పూల చాదర్లతో నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అనంతరం దర్గా వద్దకు చేరుకుని బాబావారి సమాధిపై పూల చాదర్ కప్పి, గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు తమ గ్రామాల తరఫున చాదర్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
జుమ్మా మసీదు ఇమాంగా బాబావారి సేవలు
ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాఖ్ అహ్మద్ స్థానిక మతపెద్దలతో కలిసి ఖురాన్ పఠనం, దువా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సయ్యద్ షా ఔలియా రహమతుల్లా బాబా జుమ్మా మసీదులో ఇమాంగా విశిష్ట ఆధ్యాత్మిక సేవలు అందించారని గుర్తు చేశారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జుమ్మా మసీదు నుంచి సర్వాంగసుందరంగా అలంకరించిన గుర్రంపై గంధాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి దర్గాలో సమర్పించినట్లు వివరించారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరుకు చెందిన నౌ అవర్ హిస్టరీ సంఘం అధ్యక్షుడు సూఫీ ఇమ్రాన్ ఆధ్వర్యంలో దర్గా కమిటీ సభ్యులు షేక్ గౌస్, షేక్ అల్లాబక్షు, నూర్ అహ్మద్, అజ్‌హర్ తదితరులు ఉత్సవాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.


