● కనుల పండువగా ఊరేగింపు
● కొనసాగిన ఆషాఢ సారె సంబరాలు
● ఉదయం నుంచి సాయంత్రం
వరకు భక్తుల తాకిడి
● అన్ని దర్శన టికెట్ల విక్రయాలు రద్దు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ తరఫున హైదరాబాద్‌లోని భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం బంగారు, వెండి బోనాలను సమర్పించింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, వానలు పుష్కలంగా కురియాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పించినట్లు జోగిని అవికా పేర్కొన్నారు. 17 ఏళ్ల్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఉమ్మడి దేవాలయాల కమిటీ పేర్కొంది.
భక్తితో బయలెల్లి..
బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద తెలంగాణ బంగారు బోనానికి కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతరాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 5 వందల మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ఇంద్రకీలాద్రికి వైపు సాగారు.
అమ్మవారికి ప్రణమిల్లి..
జోగిని అవికా బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు అనుసరించారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఇంద్రకీలాద్రి పరిసరాలను తరలివచ్చారు. దుర్గాఘాట్‌కు చేరుకున్న తర్వాత కృష్ణమ్మకు గంగ తెప్ప, పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితరాలను సమర్పించారు. దుర్గాఘాట్, ఘాట్‌రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. సుమారు 700 మంది కళాకారులు, కమిటీ ప్రతినిధులు చేరుకోవడంతో ఘాట్‌రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనానికి ఆలయ ఈవో, చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం బంగారు, వెండి బోనాలతోపాటు పూజ సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బుల్లెట్ శ్రీధర్, మాజీ అధ్యక్షులు పేర్కొన్నారు.
కొనసాగిన సారె సంబరం
ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించాయి. భక్తుల రద్దీ కనిపించడంతో దర్శనానికై విక్రయించే అన్ని టికెట్ల విక్రయాలను అధికారులు రద్దు చేశారు. ఆదివారం 70 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని భావిస్తున్నారు.


