ఏకపక్షంగా వైఎస్సార్‌ సీపీ ప్రభ తొలగింపు | - | Sakshi
Sakshi News home page

ఏకపక్షంగా వైఎస్సార్‌ సీపీ ప్రభ తొలగింపు

Jul 27 2026 1:48 AM | Updated on Jul 27 2026 1:48 AM

ఏకపక్షంగా వైఎస్సార్‌ సీపీ ప్రభ తొలగింపు

అనుమతులు తీసుకున్నా ఇదేంటని నేతల ఆవేదన

మేడికొండూరు: మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలోని వరదరాజస్వామి ఆలయం సమీపంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రభను తొలగించిన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీటీసీ మదమంచి శ్రీనివాసరావు, పలుకూరి రామకృష్ణారావు పేరేచర్ల గ్రామంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ చర్య తీసుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం... తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంప్రదాయబద్ధంగా ప్రభను ఏర్పాటు చేయాలని ముందుగానే నిర్ణయించామన్నారు. ప్రభ ఏర్పాటుకు సంబంధించి పోలీసు శాఖతోపాటు సంబంధిత అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. నిబంధనలను పాటించామని చెప్పారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రభను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనుమతులు మంజూరైన తర్వాత భారీ వ్యయంతో ప్రభ నిర్మాణం చేపట్టి విద్యుత్‌ అలంకరణలు, ఆధ్యాత్మిక సందేశాలతో సిద్ధం చేసినట్లు నాయకులు తెలిపారు. ఏర్పాట్లు ముగిసిన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ప్రభను తొలగించాలని ఆదేశించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. అనుమతులు ఇచ్చి, ఇలా అకస్మాత్తుగా తొలగించాలని చెప్పడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపైనా పోలీసుల ద్వారా వివక్ష చూపుతోందని ఆరోపించారు. అధికార పార్టీ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు నిర్ణయాన్ని మార్చుకున్నారని వారు విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. పండుగలు రాజకీయాలకు అతీతమని, తొలి ఏకాదశి వంటి పవిత్ర పర్వదినాల్లో ప్రజల ఆధ్యాత్మిక భావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాయకులు అన్నారు. దీనిపై భక్తులు, స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement