● ఇదేనా ప్రజాస్వామ్యం..
ఎన్నాళ్లీ దుర్మార్గం
● దరియా హుస్సేన్ ఆత్మహత్య
చేసుకునేలా పోలీసుల వేధింపులు
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
పిన్నెల్లి రామకష్ణారెడ్డి
మాచర్ల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మైనార్టీ నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. పిన్నెల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టి పోలీసులతో వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ పరోక్ష హత్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ దరియాహుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడేటట్లు పోలీసులు చర్యలు ఉన్నాయని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటూ దరియా మరణ వాంగ్మూలంలో పిడుగురాళ్ల సీఐ ఆత్మహత్యకు కారణమని చెప్పినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. టీడీపీ వారు దందాలు చేస్తూ వాటిని తప్పించుకునేందుకు నిత్యం ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అత్యంత దారుణంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసు స్టేషన్‌కు పిలిపించి హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. సివిల్ కేసు కోర్టు పరిధిలో ఉండగా దరియా హుస్సేన్‌ను ప్రతి రోజూ పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు పోలీసు స్టేషన్‌కు పిలిపించి తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారన్నారు. ఈ విధంగా గురజాల నియోజక వర్గంలో దారుణంగా అక్రమ కేసులు పెట్టి పలు గ్రామాల్లో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులను తరిమికొట్టేలా పోలీసు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా పోలీసు అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఇప్పటికై నా ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మైనార్టీ ఉద్యోగి దరియా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకొని అధికార పార్టీ అరాచకాలుపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. దరియా కుటుంబానికి న్యాయం చేసే వరకు వైఎస్సార్ సీపీ మద్దతిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో షేక్ అబ్దుల్ జలీల్, మస్తాన్‌వలి, ముస్తాఫా, బాజీ, అబ్దుల్ సత్తార్, చిన్నబద్రు, ట్రాక్టర్ కరిముల్లా, నాగూర్‌వలితో పాటు పలువురు నాయకులున్నారు.


