నరసరావుపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో ముస్లిం, క్రైస్తవ, దళిత, ఆదివాసీ, మహిళల ఓట్లు తొలగించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని మేలుకో ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రమేష్ పట్నాయక్ ఆరోపించారు. కుల నిర్మూలనా పోరాట సమితి(కేఎన్‌పీఎస్) గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కారంచేడు దళిత మృత వీరుల సంస్మరణ సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విభాగమైన భారత ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారి అనేక రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించిందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం కేవలం ధనికులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ వచ్చిందన్నారు. ప్రజలు నూటికి నూరు శాతం ఓట్లు వేసే పరిస్థితిని తొలగించి కొద్ది మంది ధనికులకు మాత్రమే ఓటు ఉండే విధంగా ఎన్నికల కమిషన్ పడరాని పాట్లు పడుతుందని దుయ్యబట్టారు. ఓటరు సవరణకు బదులుగా ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసిందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోకపోతే ఓట్లు కోల్పోయిన వారి పౌరసత్వం కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటు రద్దయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావన్నారు. హక్కులు కోల్పోయిన ప్రజలు జీవించడం కష్టతరమైన పని కనుక ప్రజల ఓట్లు తొలగించేందుకు సిద్ధమైన ఎన్నికల కమిషన్ కుట్రలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. కేఎన్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను బలోపేతం చేస్తున్న పాలకులు పీడిత కులాల ప్రజలపై నిరంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే అగ్రకుల హంతకమూకలకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. హిందూ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చి దాని స్థానంలో ఆధునిక మనుస్మృతిని రాజ్యాంగంగా అమలు చేయాలని ఉవ్విళ్లూరుతుందన్నారు. కేఎన్‌పీఎస్ జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బి.కొండారెడ్డి, కేఎన్‌పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓర్సు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్నప్రసాద్, సహాయ కార్యదర్శి జక్కా బ్రహ్మయ్య పాల్గొన్నారు.
కారంచేడు దళిత మృతవీరుల
సంస్మరణ సభలో రమేష్ పట్నాయక్


