తెనాలి రూరల్: భార్య పుట్టింటికి వెళ్లి రాకపోతుండడంతో అత్తపై కోపం పెంచుకుని అత్తింటికి కన్నం వేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాయబ్‌రసూల్ వివరాలు వెల్లడించారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి సుజాత మనవరాలు మంగళగిరి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతోంది. మనవరాలి వద్దకు కుటుంబమంతా ఈ నెల 8వ తేదీన వెళ్లి, మరుసటి రోజు తిరిగి వచ్చారు. ఇంటికి వేసి ఉన్న తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెల్లి చూడగా ఇంట్లో ఉంచిన రూ. 10 వేల నగదు, సుమారు 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్‌ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడింది సుజాత అల్లుడే అని నిర్ధారణకు వచ్చారు. సుజాత కుమార్తె శిరీష తన భర్త, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడికి చెందిన అయ్యంకి పసితో కుటుంబ కలహాల నేపథ్యంలో కొలకలూరులోని పుట్టింటికి వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా భార్య కాపురానికి రావడానికి నిరాకరిస్తోంది. ఇందుకు అత్త సుజాత కారణమని అల్లుడు కక్ష పెంచుకున్నాడు. 8వ తేదీన ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. నిందితుని నుంచి చోరీ సొత్తు స్వాధీనపర్చుకున్నట్టు వివరించారు. సమావేశంలో ఎస్‌ఐ ఆనంద్, సిబ్బంది ఉన్నారు.


