తీవ్ర వివాదాస్పదంగా పిడుగురాళ్ల సీఐ తీరు అధికార పార్టీ నేతలు చెప్పిందే చట్టంగా అమలు సివిల్ పంచాయితీలకు అడ్డాగా పోలీసు స్టేషన్ సీఐ తీరుతో ఇప్పటికే మహిళ, యువకుడు ఆత్మహత్యాయత్నం తాజాగా ఓ మైనార్టీ ఉద్యోగి బలవన్మరణం ఆరోపణలున్నా చర్యలకు ఉన్నతాధికారుల వెనకడుగు
సీఐపై కేసు నమోదు చేయాలి
సాక్షి, నరసరావుపేట: అధికార మదానికి ప్రభుత్వ, పోలీసు పెద్దల సహకారం తోడైతే ఎంతటి అరాచకాలకు పాల్పడతారనే దానికి నిదర్శనం పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు వ్యవహరిస్తున్న తీరు. ఇప్పటికే పదుల సంఖ్య వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను అక్రమ కేసులతో వేధించడం, అక్రమ వసూళ్లకు పాల్పడటం అలవాటుగా మారింది. అధికార పార్టీ నేతలు చెప్పిందే చట్టంగా విధులు నిర్వహిస్తూ తీవ్ర వివాదస్పదంగా వ్యవహరిస్తున్నా పోలీసు బాసులు మాత్రం పట్టనట్టు ఉంటూ పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం పోలీసుస్టేషన్‌లో సివిల్ పంచాయితీలు చేస్తూ అక్రమార్జనలో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. సీఐ వేధింపులు తాళలేక ఓ ఆర్యవైశ్య మహిళ స్టేషన్‌లోనే కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సరిగ్గా నెల క్రితం దళిత యువకుడు సురేంద్ర నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నం చేసి చావుబతుకుల్లోంచి బయటపడ్డారు. అది మరువక ముందే సీఐ సివిల్ పంచాయితీల దాహానికి ఓ మైనారిటీ ఉద్యోగి ఏకంగా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు మాత్రం అతను చనిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉందంటున్నారు. అతడే సూసైడ్ నోట్ రాశాడని గ్యారెంటీ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిడుగురాళ్ల సీఐ వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నాడు. పిడుగురాళ్ల పరిధిలోని ఓ గ్రామంలో రాజకీయ నాయకుడి విగ్రహం చేయి విరిగింది. దాంతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్‌సీపీ కార్యకర్తను స్టేషన్‌కు తీసుకువచ్చి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తేనే ఆ కేసులో ఇరికించనని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. గాలికి అధికారపార్టీ ఫ్లెక్సీ చిరిగినా దానికి కారణం మీరేనంటూ వైఎస్సార్‌సీపీ నేతలను వేధించి తీవ్రంగా హింసించడంతోపాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. వైఎస్సార్‌సీపీ సోషల్‌మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా రౌడీషీట్లు, పీడీ యాక్టులు తెరిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సివిల్ పంచాయితీలో తలదూర్చి సీఐ వేధించి నా భర్త మరణానికి కారణమయ్యారు. ప్రతి రోజు స్టేషన్‌కు పిలిపించి తిట్టడం, మహిళా పోలీసులతో కొట్టిస్తానని భయపెట్టాడు. డబ్బులు కట్టకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించారు. ఎస్పీ ఆఫీస్‌లో గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నా భర్త సూసైడ్ నోట్‌లో వివరాలు రాసి చనిపోయారు. నా కుటుంబానికి న్యాయం చేయాలి.
– షేక్ అమిరున్,
దరియా హుస్సేన్ భార్య
పిడుగురాళ్ల పోలీసుస్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా సీఐ మార్చాడు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక వ్యవహారాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్లు, వైఎస్సార్‌సీపీ నేతలపై వేధింపులు వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఆర్యవైశ్య వ్యాపారులను అనేక మందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారితో ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుక ఉన్న క్వార్టర్ట్స్‌లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారని సమాచారం. గత ఏడాది డిసెంబర్‌లో ఓ ఆర్యవైశ్య మహిళ పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో ఆర్యవైశ్యులు చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. అక్రమ వసూళ్లతో విసిగిన దళిత యువకుడు సురేంద్ర గత నెల 15వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడేమో మైనార్టీ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సీఐపై చర్యలు తీసుకోకపోతే ఇంకెందరి ప్రాణాలు, ఆస్తులు పోతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే మన రాష్ట్రంలో ప్రాణాలు తీస్తున్నారు, ఆత్మహత్యలకు ఉసిగొలుపుతున్నారు. దీనికి ఉదాహరణ పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు తీరు. దరియాహుస్సేన్‌ను స్టేషన్‌కు తీసుకువెళ్లి రూ.30 లక్షలు కట్టాలని డిమాండ్ చేసి అక్రమకేసులు బనాయిస్తానని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టినరోజునే చనిపోయే దుస్థితి తెచ్చారంటే ఎంతటి ఘోరమో ఆలోచించాలి. అన్ని పార్టీలలోని మైనారిటీలు ఆలోచించండి. సీఐపై వెంటనే కేసు నమోదు చేసి, ఆ స్టేషన్ విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. సూసైడ్ నోట్ ఉన్నా కేసు పెట్టకుండా బేరసారాలు చేస్తున్నారు. ఆ కుటుంబానికి కనీసం రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలి. జగనన్న ప్రభుత్వం రాగానే ఆర్యవైశ్యులు, దళితులు, మైనార్టీలకు అన్యాయం చేసిన పిడుగురాళ్ల స్టేషన్‌లోనే కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసులను చట్టప్రకారం అరెస్ట్ చేయిస్తాం.
– కాసు మహేష్‌రెడ్డి,
గురజాల మాజీ ఎమ్మెల్యే


