గుంటూరు మెడికల్: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్, బ్రిందా న్యూరో సెంటర్ అధినేత డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు బ్రింద హాస్పటల్ అధినేతలు డాక్టర్ భవన హనుమ శ్రీనివాసరెడ్డి, వసంత సిద్ధార్ధలు ఈ విరాళం డీడీలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీపాలక మండలి సభ్యులు, నాట్కో ట్రస్టు ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో వారాహి నవరాత్రులు ప్రారంభం
సత్తెనపల్లి: పట్టణంలోని శ్రీ త్రిశక్తి దుర్గాపీఠంలో వారాహి నవరాత్రులు బుధవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా అమ్మవారికి నవరాత్రులు భక్తిశ్రద్ధలతో చేస్తే శత్రు బాధలు, ఇతర సమస్యలు తొలగిపోతాయని, సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. బుధవారం శ్రీ త్రిశక్తి దుర్గా పీఠంలో దుర్గామాతను వారాహిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామాలతో అర్చనలు, గాయత్రి మూలమంత్రంతో సామూహిక కుంకుమ పూజలు, గాజులతో పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పీఠాధిపతి వెలిదండ్ల హనుమత్ స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పొంగలి షెడ్డు నిర్మాణానికి విరాళం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 17వ వార్డులో ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయంలో పొంగలి షెడ్డు నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి రూ. 1.50 లక్షల విరాళం అందజేశారు. ఆయన తరఫున బుధవారం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిబోయిన భాస్కర్, గుద్దంటి నాగేశ్వరరావు, ఇట్టా భాస్కర్, నిర్మల, రాంబాబు, గోపి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
కారెంపూడిలో ఈఎఫ్‌ల చోరీ
కారెంపూడి: పల్నాడు జిల్లా కారెంపూడి–2 గ్రామ సచివాలయంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. ప్రధాన ద్వారం తాఽళం, తర్వాత లోపల బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. దాదాపు 50 ఫారాలు దొంగిలించారని ఎంపీడీఓ జి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అవన్నీ ఆధార్ లింకు కానివని, చిరునామా మార్పు కోసం పెట్టినవిగా పేర్కొన్నారు. సర్ ప్రక్రియ గడువు పొడిగించిన నేపథ్యంలో డేటా రికవరీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం ఈ ఫారాల కోసమే కార్యాలయం మొత్తం దుండగులు వెతికినట్లుగా ఉందన్నారు. మిగతా వారి ఫారాలన్నీ బీఎల్‌ఓల వద్ద సురక్షితంగా ఉన్నాయని ఎంపీడీఓ తెలిపారు. ఆయనతోపాటు తహసీల్దార్ ఆర్. వెంకటేశ్వర్లునాయక్ ఆదేశాల మేరకు సచివాలయం–2 కార్యదర్శి కె. కోటేశ్వరరావు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


