బహిరంగంగా కనిపిస్తున్నా బాధ్యులపై చర్యలు శూన్యం సామాన్యులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపైనే ప్రతాపం ఇకనైనా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల
సత్తెనపల్లి: బహిరంగంగా పేకాట క్లబ్‌లు నడుస్తున్నా, గంజాయి విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులకు కనిపించడం లేదా అని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్‌రెడ్డి విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో పట్టుబడిన 200 కేజీల గంజాయి అక్రమ రవాణా కేసులో సత్తెనపల్లికి చెందిన ఇరువురు పట్టుబడ్డారన్నారు. గంజాయి ప్రస్తుతం విచ్చలవిడిగా లభిస్తున్నందున ఆ మత్తులో యువత ఘర్షణలకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా గత ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసినా... అధికారంలోకి వస్తే వంద రోజుల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని కూటమి నేతలు ఊదరగొట్టారన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా పట్టించు కోవడం లేదని చెప్పారు. విద్యార్థులు జీవితాలను గంజాయి మత్తులో నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల గంజాయి మత్తులో ఓ దుకాణదారుడిపై గొడవకు దిగిన వీడియో వైరల్‌గా మారినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. డీజేలు, వైఎస్సార్ సీపీ చేపట్టే ర్యాలీలకు ఆంక్షలు విధించడం మిగతా విషయాల్లో పోలీసులు సాధించింది శూన్యమన్నారు. సామాన్యులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రతాపం చూపుతున్నారని మండిపడ్డారు. అనకాపల్లి కేసులోని ఇరువురు అధికార కూటమికి సంబంధించి ఆర్మీ గ్రూపుగా ఏర్పడిన వారిలోని బాధ్యులన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్‌పై అక్రమకేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. కక్ష సాధించడానికి ఎప్పుడో మాట్లాడిన మాటలను వక్రీకరించి అడ్డగోలుగా కేసులు పెడుతున్నట్లు పేర్కొన్నారు.


